తుపాను ప్రభావంతో నేలకొరిగిన పంటలు - నష్టాల్లో ఏలూరు జిల్లా రైతులు
🎬 Watch Now: Feature Video
Michaung cyclone in Eluru: మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంట జలమయం అయ్యిందని ఏలూరు జిల్లా రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల పంటపొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
Cyclone Affected District in AP: తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి ఎడతెరిపిలేకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుసింది. కుండపోత వర్షం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలుల కారణంగా వందలాది ఎకరాల్లో వరి పంట నేలవాలింది. చేతికందిన దశలో వరిపంట నేలపాలు కావడంపై కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి గాలులు తగ్గినప్పటికీ వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తుంది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో కొందరు రైతులు ముందుగా అప్రమత్తమై ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందరు రైతులు ధాన్యాన్ని తరలించే అవకాశం లేక రోడ్ల మీదే భద్రపరచుకునేందుకు ప్రయత్నించారు. మరికొోందరు రైతులు కోతలు కోసినా తుపాను ప్రభావంతో పనలు చేనులోనే వదిలేయడంతో వర్షం నీటీలోనే నానుతున్నాయి. మరో రెండు రోజులు ఈ వర్షం కొనసాగితే ఈ పనలు నుంచి మెులకలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని ,ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.