ఎంపీతో వివాదం - గుడివాడ వైకాపా మాజీ కౌన్సిలర్ రవికాంత్ అరెస్టు - mp nandigam suresh complaint
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 1:06 PM IST
|Updated : Nov 30, 2023, 8:27 PM IST
Man Arrested in the Case of Insulting MP: కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘంలో వైసీపీకి చెందిన కౌన్సెలర్ రవికాంత్‌ను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ ఎంపీని ఫోన్ లో దూషించిన ఘటనలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. గుడివాడ కౌన్సిల్‌లో గతంలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించిన రవికాంత్‌పై అదే పార్టీకి చెందిన ఎంపీ నందిగం సురేష్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ కౌన్సిలర్ రవికాంత్‌కు చాలాకాలం నుంచి సత్ససంబంధాలు ఉన్నాయి. రవికాంత్ ఎమ్మార్పీఎస్‌లోనూ పనిచేస్తుండగా ఎంపీ గురించి మరొకరి వద్ద రవికాంత్ తప్పుగా మాట్లాడారని ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు. ఈ విషయం తెలిసిన ఎంపీ ఫోన్‌లో రవికాంత్‌ను నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్‌ను రవికాంత్ దూషించటం, వాట్సాప్‌లో అభ్యంతరకరమైన సందేశాలు పెట్టవాడని ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం రాత్రి గుడివాడ వెళ్లి రవికాంత్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారని కుటుంబసభ్యులు తెలిపారు. రవికాంత్‌ను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారని సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి.. ఎంపీ తమకు తెలుసని, తాము మాట్లాడుకుంటామని చెప్పి రవికాంత్‌ను వదిలిపెట్టాలని కోరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఎంపీతో మాట్లాడి వదిలిపెట్టాలని వేడుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేేశారు. చట్ట ప్రకారం పోలీసులు ఎవరిని అరెస్టు చేసినా 24 గంటలలోపు న్యాయస్థానంలో హాజరుపరచడం లేదా స్టేషన్ బెయిలు ఇచ్చి పంపించాలి. కానీ ఎంపీ ఒత్తిడితో పోలీసులు ఆపని చేయడం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
అరెస్ట్‌ను ప్రకటించిన పోలీసులు : రవికాంత్‌ను అరెస్టు చేసినట్లు తుళ్లూరు పోలీసులు ప్రకటించారు. రవికాంత్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎంపీ పీఏ రాజేంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులుగా రవికాంత్ తుళ్లూరు పోలీసుల అదుపులో ఉన్నాడు.