Lokesh on Alliance: పొత్తులపై తుది నిర్ణయం వారిద్దరిదే.. విలేకర్లతో ఇష్టాగోష్టిలో లోకేశ్ - YSR జిల్లాలో విలేకరులతో లోకేశ్ ఇష్టాగోష్టి
🎬 Watch Now: Feature Video
Lokesh on TDP And Janasena Alliance: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు గెలుపుపై దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 అంటుంటే.. మరోవైపు వైసీపీని ఓడించి అధికారాన్ని చేపడతామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే జనసేన సైతం వైసీపీకి వ్యతిరేకంగా పలు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు సంబంధించి మరో ఆసక్తికర విషయం పొత్తులు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లదే తుది నిర్ణయమని.. నారా లోకేశ్ అన్నారు. ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటికే చాలా సార్లు సైతం చర్చలు జరిపారని చెప్పారు. YSR జిల్లాలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన లోకేశ్.... అన్ని రంగాల్లో దారితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే విషయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఏకాభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. పార్టీ ఇన్‌ఛార్జుల పనీతీరుని బట్టే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తుకు భరోసా పేరుతో మహానాడులో ప్రకటించిన పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమమే కొలమానంగా ఇన్‌ఛార్జులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేదీ లేనిదీ చంద్రబాబు తేలుస్తారన్నారు. కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిన నేతలు తిరిగొస్తామంటే రావొచ్చని కానీ.... వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎంపిక చేస్తామంటే మాత్రం తనకు వ్యక్తిగతంగా ఇష్టంలేదని చెప్పారు. జిల్లాల వారీగా బృహత్తర ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు. సొంత జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ జగన్ ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. రుణమాఫీపై హామీ ఇవ్వబోమని స్పష్టంచేశారు.