జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 4:24 PM IST
Lokesh Condemned Attack on Dalit Youth: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలి కాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసల పెట్టడమేగాక.. దాహంవేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం.. జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.