E- autos సీఎం ప్రారంభించిన రెండురోజుల్లోనే.. షెడ్డుకెళ్లిన ఈ- చెత్త వాహనాలు ! - jagan news
🎬 Watch Now: Feature Video
క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 516 ఈ-చెత్త ఆటోలు రోడ్డు ఎక్కకుండానే మరమ్మతులకు గురయ్యాయి. ప్రభుత్వం ఎనిమిది నెలల కిందట జగన్న స్వచ్ఛ సంకల్పం పథకంలో భాగంగా 516 ఆటోలను కొనుగోలు చేసింది. వాటిని అప్పటి నుంచి పంపిణీ చేయకుండా అధికారులు గుంటూరు కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయం షెడ్లు, వార్డు కార్యాలయాల ఆవరణలో ఉంచారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ-ఆటోలను బయటకు తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు తరలించేందుకు యత్నిస్తుండగా 60 ఆటోలు మొరాయించాయి. వాటిలో బ్యాటరీ, స్టీరింగ్, బ్రేకుల్లో సమస్యలు వచ్చాయి. వీటిని ఎలాగొలాగ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు తరలించారు.
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8న ఈ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ-ఆటోలను కేటాయించిన జిల్లాలకు పంపకుండా సుమారు 170 ఆటోలను తాడేపల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాల క్రీడా మైదానంలోకి తరలించారు. బ్యాటరీతో కేవలం 80కిలోమీటర్లు మాత్రమే ఈ వాహనాలు నడుస్తాయి. దీంతో దూరం వెళ్లే ఆటోలను ఇక్కడే ఉంచారు. కొన్నింటికి చార్జింగ్ పెట్టి ఆయా పురపాలక సంఘాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో మరి కొన్ని వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. గుంటూరు నగర పాలక సంస్థకు కేటాయించిన ఆటోలు మొరాయించాయి. దాదాపు 8నెలల తర్వాత ఛార్జీంగ్ పెట్టడంతో కొన్ని వాహనాలు పనిచేయడం లేదు. మరికొన్ని వాహనలు ముందు చక్రం భాగంలో సొట్టలు వచ్చాయి. కొన్ని తుప్పుపట్టాయి. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆటోలు స్వంత జిల్లాలకు చేరక ముందే మరమ్మతులకు గురవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.