Heavy Rains in Parvathipuram: పార్వతీపురంలో భారీ వర్షం.. 20 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
🎬 Watch Now: Feature Video
Heavy Rains in Parvathipuram : పార్వతీపురం మన్యం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వరహాలు గడ్డ, సాకి గడ్డలు ఉప్పొంగాయి. వరహాలు గడ్డలో ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో పార్వతీపురంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. వరహాలు గడ్డ జిల్లా కేంద్రం నుంచి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో బైపాస్ కాలనీ జనశక్తి కాలనీ గణేష్ నగర్ కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. సౌందర్య థియేటర్ మార్గంలో రెండు అడుగులకు పైగా నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బైపాస్ కాలనీలో పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీలోని ఎస్సీ బాలుర వసతి గృహం నీట మునిగింది. దీంతో పిల్లలను సురక్షితంగా ఎగువున ఉన్న గదిలోకి తరలించారు. మండలంలోని పుత్తూరు వద్ద సాకి గడ్డ వంతెన పైనుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పార్వతీపురం మక్కువ ఒడిశా ప్రాంతాలకు ఇది ప్రధాన మార్గం కావడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నాగావళి పొంగి పొర్లుతోంది.