భూమిని ఆక్రమించారంటూ పురుగుల మందుతో కలెక్టరేట్‌లో రైతు హల్‌చల్ - విజయనగరం వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 10:24 PM IST
Farmer Complained to Collectorate land Encroachment: భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్‌లో ఓ రైతు పురుగుల మందు పట్టుకుని హల్‌చల్ చేశారు. నెల్లిమర్లకు చెందిన తుర్ల అప్పలనర్సయ్యకు కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిని కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కలిసి దురాక్రమణ చేశారని అప్పలనర్సయ్య ఆరోపించారు. ఐదేళ్లుగా భూ సమస్యను పరిష్కరించాలని వినతులు అందజేస్తున్నా పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమి కావాలంటూ అడుగుతుంటే ఇంకెక్కడైనా భూమిని ఇస్తామంటున్నారని వాపోయాడు. తన భూమిని తనకు అప్పగించి, రావాల్సిన పథకాలను ఇప్పించి తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు.
నెల్లిమర్ల పాలకొండ రోడ్డు పైవంతెన కింద 74/13, 74/17, 74/53 సర్వే నంబర్లలో తమ తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన 1.80 ఎకరం భూమి ఉందని అప్పలనర్సయ్య తెలిపాడు. భూమి ఉన్నా, రైతు భరోసా పథకం, ప్రభుత్వ రాయితీలు వర్తించకపోవడంపై సచివాలయానికి వెళ్లి అడిగితే అంతర్జాలంలో పేరు రాకపోవడంపై తమకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నాడు. స్థానిక తహసీల్దారు, వీఆర్వో దగ్గరికి వెళ్ళినా భూమికి సంబంధించిన దస్త్రం, ఎఫ్ఎంబీ, అడంగల్, పత్రాలు చూపించినట్లు తెలిపాడు. తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని అప్పల నర్సయ్య వెల్లడించాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఎటువంటి జీవనాధారం లేదని, దినసరి కూలీ చేసుకుని బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు న్యాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పలనర్సయ్య వేడుకున్నాడు.