బకాయిల జీవో జారీ చేశారు, నిధులు చెల్లింపు మరిచారు- సీఎం హామీలే అమలవ్వకపోతే ఎలా? : బొప్పరాజు - Bopparaju Venkateswarlu
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2024/640-480-20405216-thumbnail-16x9-employees-union-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 7:39 PM IST
Employees Union Leaders Meet With CS Jawahar Reddy: ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడం శోచనీయమని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నుతన సంవత్సరం సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీఏ, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులు, పెన్షనర్లు ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తూ సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చారు.
పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోతే ఉద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజారవాణా విభాగం ఉద్యోగులకు ఇప్పటి వరకూ హామీలను నెరవేర్చలేదని అన్నారు. సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. జిల్లా పరిషత్‌ల పరిధిలో ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు కావటం లేదన్నారు. మరోవైపు 12వ పీఆర్సీ ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా చైర్మన్‌కు సీటు కూడా కేటాయించలేదని అలాగే సిబ్బంది కేటాయింపూ జరగలేదన్నారు.