Elephant Dead Due to Electric Shock: తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి.. విద్యుత్ షాక్తో ఏనుగు మృతి - ఏనుగు మృతి
🎬 Watch Now: Feature Video
Elephant Dead Due to Electric Shock: చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో విద్యుత్ షాక్తో ఏనుగు మృతి చెందింది. నెల్లిపట్ల పంచాయతీ నల్లగుట్లపల్లికి చెందిన అయ్యప్ప అనే రైతు వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరమళ్లప్ప పెంట చెరువు దగ్గర ఈ ప్రమాదంపై స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన చేపట్టారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా.. అది కూలిపోయి కరెంటు వైర్లు తగలడంతో ఆడ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివన్న మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పలమనేరు రేంజి సరిహద్దులలోకి ప్రవేశించి.. అడవి పక్కన ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అతి త్వరలోనే ఏనుగులను పంట పొలాల్లోకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏనుగుల దాడిలో రైతులకు పంట నష్టం కలిగి ఉంటే ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామన్నారు.