Electricity Bills Shock in AP : వైసీపీ పాలనలో షాక్ ఇస్తున్న కరెంటు బిల్లులు.. ప్రభుత్వానికి రివర్స్ షాక్ తప్పదు : తులసిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Electricity bills shock in AP : వైసీపీ ప్రభుత్వం కూతలు, కోతలు, వాతల ప్రభుత్వంగా తయారైందని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ పాలనలో కరెంట్ తీగ అవసరం లేకుండా... విద్యుత్ బిల్లు (Power Bill) పట్టుకుంటేనే షాక్ కొడుతోందని ఎద్దేవా చేశారు. ఒక వైపు కరెంటు కోతలు, మరొక వైపు కరెంటు ఛార్జీల వాతలు అని తులసి రెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో తులసిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలన ( YCP rule ) లో కరెంటు తీగ అవసరం లేదు.. కరెంటు బిల్లు ముట్టుకుంటే నే షాక్ కొడుతోందని అన్నారు. వైసీపీ అధికారం లోకి వస్తే కరెంటు చార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఇష్టం వచ్చినట్లు బాదుతున్నాడని విమర్శించారు. జగన్ రెడ్డి తన పేరును బాదుడు రెడ్డిగా, కోతల రెడ్డి గా మార్చుకుంటే మంచిదని పేర్కొన్నారు.
ఈ 4 ఏళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారని, 50,000 వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు స్థిర చార్జీలు, కస్టమర్ సర్వీస్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు ( True up charges ) , సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం - ఇలా రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారని తెలిపారు. గృహాలకు స్మార్ట్ మీటర్ల పేరుతో మళ్లీ 13,000 కోట్ల రూపాయల బాదుడు రాబోతుందని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ( Smart meters )పేరుతో రూ 6,888 కోట్ల రూపాయల అదనపు భారం మోపబోతోందని మండిపడ్డారు. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న... దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది జగన్ వాలకం అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యుత్ వినియోగదారులు వైఎస్సార్ పార్టీ కి రివర్స్ షాక్ ( Reverse shock ) ఇవ్వక తప్పదని తులసిరెడ్డి హెచ్చరించారు.