Dog Waiting For Its Owner: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య.. ఎదురుచూస్తున్న పెంపుడు శునకం - ap telugu news
🎬 Watch Now: Feature Video
Dog Waiting For Its Owner: విశ్వాసం అంటే గుర్తుకు వచ్చేది శునకం. దగ్గరికి చేరదీసి గుప్పెడు మెతుకులు పెడితే చాలు జీవితాంతం మనకు తోడు ఉంటుంది. మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతుంది. ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి మనకు అండగా ఉంటుంది. అందుకే చాలా మంది వాటికి పుట్టినరోజులు జరపడం, చనిపోతే సమాధి కట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడో ఓ శునకం చేస్తున్న పని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గోదావరిలో దూకి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆ మహిళతో వచ్చిన పెంపుడు శునకం ఆమె కోసం వారధిపై గంటల తరబడి వేచి చూసిన ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం ఎదురులంక వారధి పైనుంచి గౌతమీ గోదావరిలోకి దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహిళతో పాటుగా వచ్చిన పెంపుడు శునకం ఆమె వదిలిన చెప్పులు వద్దనే ఉండి మధ్య మధ్యలో గోదావరి వైపు చూస్తూ మొరగడం.. యజమానురాలు కోసం ఎదురుచూడటం చేస్తోంది. ఈ విషయం వారిధిపై వెళ్తున్న వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.