'మా వైసీపీలో అగ్రవర్ణాల పెత్తనం'.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు - వైసీపీలో అగ్రకులాల పెత్తనం న్యూస్
🎬 Watch Now: Feature Video
Dy CM Narayanaswamy Sensational Comments: తమ వైసీపీ పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై తాను మాట్లాడితే.. కొంతమంది వైసీపీ నేతలకు తనపై కోపం వస్తుందని, అవేవీ తాను పట్టించుకోనంటూ ఆయన అన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా గృహనిర్మాణ ప్రగతిపై మంత్రి జోగి రమేష్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నారాయణస్వామి పాల్గొన్నారు. తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ అగ్రవర్ణాలకు చెందినవారే ఎక్కువగా ఉండటంతో తనకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వేదికపై ఉన్న వారిని చూపిస్తూ, ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో కూడా తనకు ఇరువైపులా రెడ్లే ఎక్కవగా ఉన్నారని అన్నారు.
తన నియోజకవర్గ పరిధిలో పేదలకు కొండలు, గుంటలు, మిట్టలు ఉన్న చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నియోజకవర్గంలో అన్ని రకాలుగా అనువైన చదును భూములను జగనన్న కాలనీలకు ఇచ్చారని తెలిపారు. బాలకృష్ణాపురంలో జలకళ పథకం కింద చంద్రబాబు వర్గీయులకు 25 బోర్లు మంజూరు చేశారని ఆయన చెప్పారు. వీరంతా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నా.. తమ పార్టీకి మాత్రం ఓటు వేయరని తెలిపారు. తన నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సరైన భూములు కేటాయించకపోవడంతో దళితులు దీనిపై ప్రశ్నిస్తున్నారని వాపోయారు. దీంతోపాటు ఏ కులానికి ఎన్ని ఇళ్లు కేటాయించారో అనే అంశంపై అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం శోచనీయమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.