పేదల ఇళ్లపై వైసీపీ నేతల కన్ను - స్టేషన్కు పిలిపించి జేసీబీలతో కూల్చివేత
🎬 Watch Now: Feature Video
Demolition of Houses in Guntur: గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. 20 సంవత్సరాలుగా ఇంటి పన్ను చెల్లిస్తూ నివాసముంటున్న ఇళ్లను జేసీబీతో కూల్చివేశారని నివాసం ఉంటున్న వారు వాపోయారు. ఇప్పటికే అధికారులు మూడు ఇళ్లను తొలగించగా మరో రెండు ఇళ్లను కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
YCP Leaders Collapse Houses: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామంలో వైసీపీ నేతలు వారం రోజుల క్రితం మూడు ఇళ్లను కూల్చి వేశారు. దీనిపై బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కూల్చివేతలకు పోలీసులు కూడా సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంగళాయపాలెంలో ప్రభుత్వ పోరంబోకు భూముల్లో కొందరు పేదలు దశాబ్దాల క్రితమే ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. వారి నుంచి మరికొందరు ఆ స్థలాలు కొని రేకుల షెడ్లు నిర్మించుకున్నారు. వైసీపీకి చెందిన నరేందర్ రెడ్డి, సుభాని, రామకృష్ణ అనే వ్యక్తులు వచ్చి ఈ స్థలాలు తమవని, పత్రాలు ఉన్నాయని గొడవకు దిగారని బాధితులు తెలిపారు. నాలుగు నెలల నుంచి ఈ వివాదం నడుస్తోంది. దీనిపై ఇక్కడ నివాసం ఉంటున్నవారు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపించగా వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నేతలు జేసీబీతో వచ్చి ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి అనుచరులు ఈ పని చేసినట్లు సమాచారం. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు స్థలం మీది కాదు వెళ్లిపోవాలని దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ ఇళ్లకు సంబంధించిన పన్నులు కూడా కొన్నేళ్గుగా చెల్లిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం తగిన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.