Tension in Palasa: కల్వర్టు కూల్చివేతకు యత్నం.. టీడీపీ నేతల ఆందోళన.. పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత
🎬 Watch Now: Feature Video
Tension in Palasa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు.. అధికార పార్టీకి తొత్తులుగా మారి.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో సామాన్య ప్రజల పట్ల, ప్రతిపక్ష నేతల పట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. పట్టణ, జిల్లా, గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉండేవారిని, సమస్యలపై ప్రశ్నించేవారిని ఏదో రకంగా భయపెట్టాలనే లక్ష్యంతో.. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు.. అధికారుల ద్వారా వారి కక్షలను తీర్చుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తన ఇంటి ముందు నిర్మించుకున్న కల్వర్టు.. అక్రమమంటూ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులకు తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
పలాస కాశీబుగ్గలో ఉద్రిక్త వాతావరణం.. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు.. పదిహేనేళ్ల కిందట తన ఇంటికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా సాగు నీటి కాలువపై కల్వర్టు నిర్మించుకున్నారు. అది అక్రమమంటూ తొలగించేందుకు అధికారులు నిన్న (శనివారం) ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగరాజుకు సంఘీభావంగా.. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గౌతు శిరీష ఘటనాస్థలికి చేరుకుని బైఠాయించారు. అధికారులు రాత్రి పదకొండున్నర సమయంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో అధికారులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతోనే అధికారులు.. ఈ కక్షపూరిత చర్యకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అల్లర్లు సృష్టిస్తే ఊరుకోం.. ''రాజకీయ కక్షతో నాపై దాడి చేస్తే న్యాయం కోసం పోరాడతా. నా ఇంటి రాకపోకలకు, సాగునీరు ఆటంకం లేకుండా కల్వర్టు ఏర్పాటు చేసుకుంటే ఇదేమి చోద్యం. గత 15 ఏళ్లుగా అభ్యంతరంలేని ఈ వ్యవహారం.. ఆకస్మాత్తుగా ఇప్పుడు అధికారులకు గుర్తుకు వచ్చిందా..?, కల్వర్టు అక్రమ నిర్మాణమంటూ రాత్రికి రాత్రి ఎలా తొలగిస్తారు..? ప్రశాంతంగా ఉన్న పట్టణంలో మంత్రి అప్పలరాజు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే.. అది అధికారుల బాధ్యతే'' అని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు అన్నారు.