CPM samarabheri Program: కేంద్రానికి... వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, ఆగడాలు కనిపించడం లేదా: సీపీఎం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 10:26 PM IST
CPM samarabheri Program: దేశంలోనే అత్యంత నిజాయితీపరులైన నాయకులు రాష్ట్రంలోనే ఉన్నట్లు బీజేపీ భావిస్తున్నట్లు ఉందని సీపీఎం నేత రాఘవులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా.. ఈ నెల 30 తేదీ నుంచి సెప్టెంబర్ 4 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం సమరభేరీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీపీఎం నేత రాఘవులు వెల్లడించారు. అవినీతి పేరు చెప్పి ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్న కేంద్రానికి.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, ఆగడాలు కనిపించడం లేదా అని బీవీ రాఘవులు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి అన్నివిధాల సహకరిస్తున్నందుకే.. రాష్ట్రంలో ఎలాంటి ఈడీ, సీబీఐ దాడులు జరగడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మిత్రులంతా మంచివారని, అదే బీజేపీని విమర్శించే వారు మాత్రం అవినీతిపరులని రాఘవులు మండిపడ్డారు. దేశంలో చట్ట భద్రత లేదని, బీజేపీ భద్రత మాత్రమే ఉందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటున్నాయని, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానివి నవరత్నాలు కాదు నవ భారాలు అని ధ్వజమెత్తారు.