CPI: మళ్లీ మళ్లీ శంకుస్థాపన.. జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది: సీపీఐ రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
CPI Leader Ramakrishna on Jagan: జాతీయ హోదా కలిగిన బహుళార్ధ సార్ధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 45 వేల కోట్లు కావాలని, సంవత్సరానికి 15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మూడేళ్లలో పూర్తవుతుందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు వేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. తక్షణమే అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించి ప్రధాని మోడీ వద్దకు తీసుకువెళ్లాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అడ్డుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. కడప ఉక్కు కర్మాగారానికి ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపన చేశారని విమర్శించారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ శంకుస్థాపన చేశారన్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాలపై అఖిలపక్షాన్ని ప్రధానితో సమావేశానికి ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.