తీవ్ర తుపానుగా మారుతున్న వాయుగుండం - అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం - ఏపీలో మైచౌంగ్ తుఫాను న్యూస్ అప్డేట్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 9:37 PM IST
CM Jagan Review on Cyclone Michaung: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన రాష్ట్రంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, పాలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం జగన్ సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు 2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు కోటి రూపాయల చొప్పున విడుదలచేశారు.