న్యాయం చేయండి - కేంద్ర బృందాన్ని కోరిన రైతులు
🎬 Watch Now: Feature Video
Central Drought Team Visited Kurnool : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించాయి. కర్నూలు జిల్లాలోని ఆస్పరి, దేవనకొండ, ఆదోని మండలాల్లో పంటలను పరిశీలించారు. బిలేహాల్ గ్రామంలోని రైతులతో మాట్లాడి పంట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. కరవు బృందం నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం రైతులు కేంద్ర బృందంతో తమ గోడును వినిపించారు.
ఏటా ఖరిఫ్‌లో కురిసే వానలకు ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు పండే పత్తి ఈసారి అర క్వింటాం కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైన దిగుబడి రాకా నష్టపోయామని పేర్కొన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాక అప్పుల్లో కురుకుపోయామని వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు, తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేదని వాపోయారు. పంట పెట్టుబడిని అంచనా వేసి తమకు తగిన న్యాయం చేయాలని కేంద్ర బృందాన్ని కోరుకున్నారు.
సత్యసాయి జిల్లాలోని మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాల్లో బృంద సభ్యులు పర్యటించి వర్షానికి దెబ్బతిన్న వేరుశనగ, కందిపంటలను పరిశీలించారు. హరేసముద్రం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంట నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
అనంతరం బృంద సభ్యులు పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద ఫొటో ప్రదర్శనను తిలకించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరులో రాజేంద్రరత్నూ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పంటలను పరిశీలించింది. రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందానికి తెలుగుదేశం నేతలు వినతిపత్రం అందజేశారు.