Baireddy conference at Kadapa: బాబాయ్ కేసులు తప్ప.. రాయలసీమ అభివృద్ధి పట్టదా.. : బైరెడ్డి - కృష్ణాపెన్నార్ ప్రాజెక్టు
🎬 Watch Now: Feature Video
Baireddy conference at Kadapa: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యాస, శ్వాస అంతా కేసుల నుంచి బయటపడేందుకు తప్ప రాయలసీమ అభివృద్ధిపై లేదని రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఎనిమిది జిల్లాల స్టీరింగ్ కమిటీ నేతలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఛలో ఢిల్లీ కార్యక్రమంపై కడపలో సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనాదిగా రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. కృష్ణాపెన్నార్ ప్రాజెక్టు కోల్పోవడం వల్ల రాయలసీమ ఎంతో నష్టపోయిందని బైరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రూ.13 వందల కోట్లతో సిద్ధేశ్వరం వద్ద నిర్మిస్తున్న తీగల వంతెన స్థానంలో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలను కేంద్రం దృష్టికి తెచ్చి, మరోసారి రాయలసీమ ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నామన్నారు. రాయలసీమ వ్యాప్తంగా 20 రోజులకు పైగా రాయలసీమ పరిష్కారం కోసం చేపట్టిన సంతకాల సేకరణకు మంచి స్పందన వచ్చిందని, సుమారు మూడున్నర లక్షల మంది సంతకాలు చేశారని వెల్లడించారు. రెండో విడత సంతకాల సేకరణలో యువత, విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఇప్పటికైనా రాయలసీమ సమస్యల పట్ల దృష్టి సారించాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ వాసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాబాయ్ కేసుల కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడం లేదని విమర్శించారు.