Seaplane Tourism From Rushikonda to Jolaput Start Soon : పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా రాష్ట్రంలో జల విమాన (సీ ప్లేన్) విహారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇటీవల విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆయా ప్రాంతాల్లోని జలవనరులు విమానాల రాకపోకలకు ఎంత అనుకూలం, రాబడి, ప్రతికూల పరిస్థితులు తదితర అంశాలపై సర్వే చేశారు. ఇప్పటికే విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ విహారం ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
సర్వేలో ఏం తేలిందంటే
- ఏపీ విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ) విజయనగరం జిల్లా భోగాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అరకు, పాడేరులో ప్రాథమిక అధ్యయనం చేపట్టింది. విమానయాన సంస్థ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల బృందం ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పది రోజుల కిందట పర్యటించి సర్వే చేపట్టింది. సీ ప్లేన్ దిగేందుకు తగిన పరిస్థితులను గుర్తించడానికి సీ ప్లేన్ కెప్టెన్‌తో పాటు నిర్వహణ, వాణిజ్య తరహా అంశాల పరిశీలనకు మరో ఇద్దరు నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
- ఈ బృందం మొదట విశాఖ జిల్లాలోని రుషికొండ, భీమిలి సముద్ర తీరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రుషికొండలో తీరం కొంత ప్రతికూల పరిస్థితులున్నట్లు, ఇక్కడే బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉండడంతో సాంకేతిక అంశాల పరంగా నిర్వహించడం వీలుపడదన్నట్లు భావిస్తున్నారు.
- భీమిలి తీరం సీ ప్లేన్ నిర్వహణకు చాలా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు.
- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోలాపుట్ జలాశయాన్ని పరిశీలించగా అక్కడ విమానం దిగడానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ మౌలిక వసతుల సమస్యతో పాటు విశాఖ నుంచి అరకు, అరకు నుంచి మళ్లీ జోలాపుట్‌కు చేరుకోవడం వ్యయప్రయాసతో కూడినదిగా భావిస్తున్నారు.
- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి, దిండి, పసర్లపూడి, కోటిపల్లి, అంతర్వేదిలను పరిశీలించి నిర్వహణకు ఎంతవరకు అనుకూలమో సర్వే చేశారు. ఇక్కడ కోరంగి, మిగిలిన ఒకటి, రెండు ప్రాంతాలు ఫర్వాలేదని తేల్చినట్లు సమాచారం.
- మలి దశలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ పరిశీలించనున్నారు. వీటన్నింటిపై తుది నివేదిక వచ్చాక ఎక్కడి నుంచి ఎలా నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంటారు.
ఇకపై నీటిలోనూ ఎగరొచ్చు - రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో సర్వీసులు
ప్రాథమికంగా గుర్తించిన మార్గాలు
- విశాఖ-కాకినాడ-విజయవాడ-శ్రీశైలం
- విశాఖ-కాకినాడ-విశాఖ
- కాకినాడ-విజయవాడ-కాకినాడ
- విశాఖ-విజయవాడ-విశాఖ
- విశాఖ-శ్రీశైలం-విశాఖ
- ప్రస్తుతానికి విశాఖ నుంచి కాకినాడ, అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి శ్రీశైలం ఒక మార్గంగా నిర్వహించాలని దీనికి కొంత ఆదరణ ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
'విజయవాడ టు శ్రీశైలం' - రిజర్వాయర్‌లో సురక్షితంగా దిగిన విమానం