Ratha Saptami 2025 Telugu : హిందూ సంప్రదాయాలలో సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని 'రథ సప్తమి' అని పిలుస్తారు. ఇది సూర్య భగవానుడి జన్మదినం. ఈ నెల 4వ తేదీన (మంగళవారం) రథ సప్తమి వచ్చింది. రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేక విధి విధానాలతో స్నానం ఆచరించడం, పూజ చేయడం, కొన్ని వస్తువులను దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
స్నానానికి ఎంతో ప్రాధాన్యత!
రథ సప్తమి రోజు చేసే స్నానం, దానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందట! అందువల్ల రథ సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయాలని మాచిరాజు తెలిపారు. ఇందుకోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. వాటిని శిరస్సుపై ఉంచి తలంటు స్నానం చేయాలని చెప్పారు. ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, అవి సూర్యుడికి ఇష్టమైనవి. ఈ విధమైన ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట.
సూర్యుడి ఆరాధన :
రథ సప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఆరాధించాలి. ఇందుకోసం వీలైతే మీ ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి. ఆ మండపం దగ్గర సూర్యుడి ఫొటో ఉంచాలి. ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యుడిగా భావించాలి. మీ దగ్గర సూర్య భగవానుడి ఫొటో ఉంటే పెట్టండి. అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది. పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదం స్వీకరించాలి.
దానం ఇవ్వాల్సిన వస్తువులు!
సూర్య భగవానుడికి ప్రీతికరమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అదృష్టం బాగా కలిసి వస్తుందని పేర్కొన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పారు.
నదిలో దీపం విడిచిపెట్టాలి!
ఎవరైనా పల్లెల్లో ఉండే వారికి నది దగ్గరగా ఉంటే ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలని మాచిరాజు సూచిస్తున్నారు. రథ సప్తమి రోజున ఉదయం పూట, ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఆపై వెలుగుతున్న దీపాన్ని తలపై పెట్టుకుని నది దగ్గరికి వెళ్లాలి. తర్వాత దీపాన్ని నదిలో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే మీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాలన్నింటినీ దూరం చేసుకోవచ్చని తెలిపారు.
రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పూలు, ఎండు మిర్చి లోపల ఉండే గింజలు వేయాలి. 'ఓం సవిత్రే నమః' అనుకుంటూ తూర్పు వైపు తిరిగి ఆ నీటిని మొక్కలో పోయండి. ఈ పరిహారం పాటించడం వల్ల ప్రమోషన్లు త్వరగా వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుందని మాచిరాజు చెప్పారు.
- రథ సప్తమి రోజున సూర్యాష్టకం చదివినా, విన్నా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
- అలాగే ఎర్రటి వస్త్రంలో గోధుమలను కట్టి దానం చేసినా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
- సూర్య భగవానుడి జన్మదినమైన రథ సప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వసంత పంచమి స్పెషల్- ఈ రోజు బాసర సరస్వతి పూజ చేస్తే- పిల్లలకు విద్యాబుద్ధులు కలగడం ఖాయం!