Bridge Collapsed in Bapatla District: కూలిన దశాబ్దాల నాటి వంతెన.. 20 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
🎬 Watch Now: Feature Video
Bridge Collapsed in Bapatla District: బాపట్ల జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెం-మోదేపల్లి గ్రామాల మధ్య ఉన్న దోర్నపు వాగుపై నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది. దీంతో సుమారు ఇరవై గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు వంతెన కూలినచోట రాళ్లు, మట్టి వేసి.. దానిపై రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై ఈనాడులో వచ్చిన కథనంతో జిల్లా కలెక్టర్.. రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో గురువారం సాయంత్రం మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి కూలిన వంతెనను పరిశీలించారు. కాగా వంతెన కుప్పకూలిపోవటానికి.. దానిపై అక్రమ ఇసుక తోలకమే ప్రధాన కారణం అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
మోదేపల్లి వద్ద మేదరమెట్లకు చెందిన ఓ వైసీపీ నాయకురాలు అక్రమ ఇసుక తవ్వకాలు జరిపిస్తున్నారని అన్నారు. ఇసుకను తరలించే లారీలు 30 నుంచి 40 టన్నుల వరకు బరువున్న లోడుతో వెళ్లటం వలనే వంతెన కూలిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని వందల ట్రిప్పులు లారీలతో ఇసుకను ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలించేందుకు ఈ వంతెనపై రాకపోకలు సాగించినట్లు తెలిపారు. దీంతోపాటు వంతెన పాడైనా కూడా అక్రమ రవాణా మాత్రం ఆపకుండా.. యథేచ్ఛగా రాత్రి సమయంలో ఇసుక తరలింపు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారులకు విన్నవించుకున్నా వారు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు ఉండటంలో అంతర్యమేమిటో అని పలువురు గుసగుసలాడుతున్నారు.