Bopparaju Venkateswarlu Demand సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు - revenue employees news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2023, 5:44 PM IST
Bopparaju Venkateswarlu on YSRCP Government: రాష్ట్ర ప్రభుత్వంపై రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల అమలు విషయంలో సాధ్యంకాని నిబంధనలను అమలు చేసి, ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధం లేని విధులను కేటాయించి మానసికంగా ఒత్తిడిచేయటం సరైంది కాదని బొప్పరాజు ఆగ్రహించారు.
Bopparaju Venkateswarlu Comments: అనంతపురం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించిన బొప్పరాజు.. అన్ని విభాగాల్లో ఉద్యోగులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగిందని మండిపడ్డారు. ''రెవెన్యూ ఉద్యోగులు.. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకపోయినా పని చేస్తున్నారు. తాజాగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కొందరు కలెక్టర్లు, జేసీల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. గ్రామాల్లో రీసర్వే 100 రోజుల్లో పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం 15 రోజుల్లో పే పూర్తి చేయాలని ఆదేశించడం సరికాదు. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధం లేని విధులను కేటాయిస్తున్నారు. నాలుగేళ్లుగా ఓటర్ల పరిశీలనా పనులు చేస్తున్నా.. నిధులు ఇవ్వలేదు. ఒక్క అనంతపురం జిల్లాకే రూ.5 కోట్లు బకాయి ఉంది. ఓటరు పరిశీలనలో ఒక క్లెయిమ్‌కు రూ.10 ఖర్చు అవుతున్నా.. రెవెన్యూ ఉద్యోగులే జీతం నుంచి ఖర్చు పెడుతున్నారు. అక్టోబరు 1న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఆ రోజు సమస్యలను మంత్రులు, ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే.. తిరుగుబాటు తప్పదు''అని బొప్పరాజు హెచ్చరించారు.