Amaravati R5 Zone: ఆర్ 5 జోన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కేంద్ర మంత్రికి లేఖ
🎬 Watch Now: Feature Video
BJP Satya Kumar letter to Central Minister Hardeep Singh Puri: రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్‌లో ఇళ్ళు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ఏపీ రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్న సత్యకుమార్.. ఇందుకోసం ప్రత్యేక విధివిధానాలతో కొన్ని ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. భూసమీకరణ నిబంధనలు, ఆ తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించి అమరావతిలో జోన్-3లో 17 వందల ఎకరాలను పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారని తెలిపారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం జోన్-5 ఏర్పాటు చేసి పేదల ఇళ్ల కోసం అని 11 వందల ఎకరాలు కేటాయించిందని సత్యకుమార్ లేఖలో పేర్కొన్నారు. అమరావతి ఒరిజినల్ మాస్టర్‌ప్లాన్ లో ప్రతిపాదించిన నవ నగరాల్లో ఒకటైన ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన స్థలాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పేదల ఇళ్ల కోసం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనను రాజధాని కోసం 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్.. రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.