BJP Leader Sathya Kumar Comments on Jagan: సీఎం జగన్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారు: సత్యకుమార్ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 12:37 PM IST
BJP Leader Sathya Kumar Comments on Jagan: రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగిస్తున్న వైసీపీని రాజకీయంగా సంహరించేందుకు ప్రజలు ముందుకు రావాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. ద్వాపర యుగంలో ధర్మ రక్షణ కోసం శ్రీ కృష్ణుడు పాటుపడ్డారని.. ఇప్పుడు అన్ని రకాలుగా ప్రజల్ని బెదిరిస్తూ, దోచుకుంటున్న వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి అవినీతిలో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారని విమర్శించారు. భూముల డిజిటలైజేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారని.. జగనన్న భూ రక్ష పేరిట పట్టా పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు తెచ్చి ఆ తప్పుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మోపటం సరికాదన్నారు. ప్రజల ఆస్తుల మీద కన్నేసి.. రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తెచ్చారని ఆరోపించారు. ఐటి కేసులో చంద్రబాబుని కేంద్రం అరెస్టు చేసే అవకాశం లేదని తెలిపారు. చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పైనేనని అభిప్రాయపడ్డారు. ఇండియాకు భారత్ పేరు పెట్టడంలో ఎవరికీ ఇబ్బంది లేదని గతంలో చాలా దేశాలు అలా పేర్లు మార్చాయని గుర్తు చేశారు. వలస పాలకులు పెట్టిన ఇండియా పేరుని కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు.