Bike Racing on Amaravati Foads: అమరావతి రోడ్లపై రెచ్చిపోతున్న యువత.. బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు - Youth Bike Feet
🎬 Watch Now: Feature Video
Bike Racing on Amaravati Foads: అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్‌యాక్సెస్ రోడ్డులో బైక్ రేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేసులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూడడం పోలీసులను కంగుతినిపిస్తోంది. ఈ రేసుల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎవరు నిర్వహిస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం జరిగింది. కాగా, రద్దీ తక్కువగా ఉండడంతో పాటు పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందనే ఆలోచనతో నిర్వాహకులు.. విశాలమైన ఈ రహదారులను ఎంచుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్, పెనమలూరు - ఉయ్యూరు రహదారి, నున్న ప్రాంతాల్లో బైక్ రేసులు దుమారం రేపాయి. వాటిపై పోలీసులు నిఘా ఉంచి.. దృశ్యాల ఆధారంగా రేసుల్లో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో కొంతవరకు నగరంలో రేసుల జోరు తగ్గింది. సీడ్‌యాక్సెస్ రోడ్డులో రేసుల దృశ్యాలు బయటకు రావడంతో.. ఎప్పుడు ఈ రేసులు నిర్వహించారు? అనే కోణంలో కూడా పోలీసులు వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. తాజాగా తుళ్లూరు మండలం దొండపాడు - రాయపూడి మధ్య సీడ్ యాక్సిస్ రహదారిపై కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన యువత బైక్ ఫీట్లు నిర్వహించారు. ప్రమాదభరితంగా ఫీట్లు చేస్తూ అదే రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. వీరి ఆగడాలకు విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చేలోపు యువత తమ పని కానిచ్చేశారు. చివరికి అతి కష్టంతో ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా 17 నుంచి 20 సంవత్సరాలలోపు యువకులున్నారు. వీరిలో కొంత మంది యువతులు ఉన్నట్లు సమాచారం.