Bhuma Akhila priya comments 'నంద్యాలలో విచిత్రమైన సంస్కృతి నడుస్తుంది.. త్వరలోనే అన్ని ఆధారాలను వెల్లడిస్తా'
🎬 Watch Now: Feature Video
TDP EX Mnister Bhuma Akhila Priya latest Comments: దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల జిల్లాలో విచిత్రమైన సంస్కృతి నడుస్తుందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బెయిల్‌పై విడుదలైన ఆమె ఈరోజు నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌కు విచ్చేసి సంతకం చేసి వెళ్లారు. ఈ సందర్భంగా భూమా అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన రోజున ఏం జరిగిందో ఆ వివరాలకు సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు.
త్వరలోనే ఆధారాలతో మీడియా ముందుకు వస్తా.. తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో అరెస్టై, 14 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బుధవారం రోజున కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె నేడు నంద్యాల తాలూకా పోలీసు స్టేషన్‌లో సంతకం చేసేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..''నాకు తెలిసి దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడలేని విచిత్రమైన సంఘటన నంద్యాలలో కనిపిస్తుంది. ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్లపై కేసు పెట్టి ఈరోజు స్టేషన్లకు తిప్పుతున్నారు. నిజంగా ఇట్లాంటి సంస్కృతి నేనెక్కడ చూడలేదు, వినలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. నామీద కేసు పెట్టినవాళ్లే కాకుండా ఎవరైతే కేసు పెట్టించడానికి అన్ని విధాలా ప్రయత్నించినారో.. వాళ్లందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. పోలీసులు పట్టించుకోవటంలేదు. ప్రజలకు, మీడియాకు వాస్తవాలు తెలియాలి కాబట్టి త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను.'' అని ఆమె అన్నారు.
అసలు ఏం జరిగిదంటే.. ఈ నెల (మే) 16వ తేదీ రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల భాగంగా భూమా అఖిల ప్రియ అనుచరులు, ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అఖిల ప్రియ దంపతులను ఆళ్లగడ్డలో పోలీసులు అరెస్టు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం వారికి 14 రోజులపాటు రిమాండ్ విధించగా.. బుధవారం రోజు బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు.