విజయవాడలో కొట్టేశారు - ఉత్తరప్రదేశ్​లో మార్చేశారు : బ్యాంకులో చెక్కులు మాయం చేసిన కేటుగాళ్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 1:33 PM IST

thumbnail

Bank Cheques Fraud  in Vijayawada:వేర్వేరు బ్యాంకుల్లో ఇద్దరు వ్యక్తులు.. ఖాతాదారులు, బ్యాంకును బురిడీ కొట్టించి చెక్కులతో ఉడాయించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న వన్ టౌన్ పరిధిలోని (HDFC) హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఇద్దరు వ్యక్తులు ఖాతాదారుల చెక్కులను మాయం చేశారు. ఒకే రోజు ఒకే తరహాలో జరిగిన ఈ నేరాలపై వన్ టౌన్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Thugs Cheated the Bank Staff: మొత్తం రెండు బ్యాంకుల్లో 9 చెక్కులు మాయం కాగా.. అందులో 7 చెక్కులు నగదుగా మారాయి. 50 రోజుల తరువాత గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌కు చెందిన మహేంద్ర హోజరీ సెంటర్‌ అనే సంస్థకు స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కరెంట్‌ ఎకౌంట్‌ ఖాతా ఉంది. సెప్టెంబరు 30న మహేంద్ర హోజరీ సంస్థకు చెందిన 8 చెక్కులను ఖాతాదారులు బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లారు. బ్యాంకులోని చెక్‌ డ్రాప్‌ బాక్సు వద్ద నిలబడి చెక్కులను సరి చూసుకుంటుండగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఖాతాదారులతో మాటలు కలిపారు. ఖాతాదారులు చెక్కులను బ్యాంకు కౌంటర్‌లో జమ చేసేందుకు వెళ్లగా అతనితో పాటు అపరిచిత వ్యక్తి కూడా కౌంటర్‌ వద్దకు వెళ్లారు. ఖాతాదారుడితో మాట్లాడుతూ అతనితో వచ్చిన వ్యక్తిలాగా కౌంటర్‌లో ఉన్న బ్యాంకు సిబ్బందిని బురిడి కొట్టించిన దుండగులు చెక్కులను మాయం చేశారు. చెక్కులను దుండగులు అక్టోబర్ 3న ఉత్తర్ ప్రదేశ్​లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో జమ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ 8 చెక్కుల విలువ రూ.3,18,656 కాగా వాటిలో రూ.2,43,656 విలువైన 6 చెక్కులు నగదుగా మారిపోయాయి. మిగిలిన 2 చెక్కులు వివిధ కారణాలతో ఆగిపోయాయి. దీన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఈ నెల 21న కేసు నమోదు చేశారు.  

మరో ఘటన: వన్‌టౌన్‌ కాన్వెంట్‌ వీధిలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్​కు సెప్టెంబరు 30న ఇద్దరు అపరిచిత యువకులు వచ్చారు. వారు చెక్కు డ్రాప్‌ బాక్సులో చెక్కు వేస్తున్నట్లు నటించి దానిలో ఉన్న మెస్సర్స్‌ వైష్ణవి క్రియేషన్స్‌ పేరుతో ఉన్న చెక్కును దొంగిలించారు. ఈ చెక్కును అక్టోబరు 3న షహహాన్ పూర్ శాఖల్లో అశోక్ కుమార్ పేరుతో జమ చేసినట్టు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది సీసీ పుటేజీ చూడటంతో చెక్కు డ్రాప్  బాక్సు నుంచి చెక్కు దొంగిలించిన వైనం బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.