ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం - ప్రసాదరావు
🎬 Watch Now: Feature Video
APTF Demands on Govt : కొంతమంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని.. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ ప్రధాన కార్యదర్శి.. పాండురంగ ప్రసాదరావు తెలిపారు. వాళ్ల వల్లే ప్రభుత్వానికి తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం ఏర్పడిందని మండిపడ్డారు. తమకు బకాయిలు చెల్లించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ నెల ఒకటో తేదీన జీతం రానటువంటి పరిస్థితి నెలకొందన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు తమపై జీపీఎస్ ను బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో.. తమకు జరుగుతున్న అన్యాయం గురించి చైతన్యం రగిలించడానికి ఉద్యమం తప్ప వేరే మార్గం లేదన్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈనెల 15వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేస్తున్నామన్నారు.