Devineni Uma On Polavaram: పోలవరం డ్యామ్ దౌర్భాగ్య పరిస్థితికి జగన్నాటకమే కారణం: దేవినేని ఉమ - devineni uma on polavaram issue
🎬 Watch Now: Feature Video
Devineni Uma sensational comments on CM Jagan: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కొన్ని రోజులుగా ప్రశ్నల వర్షం కురిస్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ముఖ్యమంత్రి జగన్, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇంకెన్నాళ్లు కప్పిపుచ్చుతారో..? అంటూ తాజాగా ధ్వజమెత్తిన దేవినేని ఉమ.. పోలవరం డ్యామ్ దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్ మోహన్ రెడ్డి.. జగన్నాటకమే కారణమని ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతారాహిత్యమైన పనుల వల్లే గైడ్ బండ్ కుంగిపోవటం.. డయాఫ్రం వాల్‌కు గుంతలు పడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్ భద్రత, కుంగిన గైడ్ బండ్, గుంతలు పడిన డయాఫ్రం వాల్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారో..? రైతాంగానికి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌పై దేవినేని నిప్పులు.. మాజీ మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడుతూ..''పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచాడు ఈ జగన్ రెడ్డి. దాని కారణంగా గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగిపోయింది. రూ.81 కోట్లు చిన్న చితకా సమస్య అన్న జగన్ రెడ్డి.. మీకు చిన్న చితకా సమస్య కావొచ్చు. స్పిల్‌వే భద్రత, డయాఫ్రమ్ వాల్ కుంగింది. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు..? రివర్స్ టెండర్ డ్రామాలతో కోట్లు దోచిపెట్టిన ముఖ్యమంత్రి జగన్.. నీ మూర్ఖత్వం వల్ల డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతింది. మీడియాను కట్టడి చేశావ్ కదా.. దెబ్బతిన్న ఆ పనులను మీడియా చూపిస్తుందని అందరిని కట్టడి చేయగలవా..? మీ 31మంది ఎంపీలు దీల్లీలో గడ్డి పీకుతున్నారా..? పోలవరం దేశానికీ గుండె కాయలాంటి ప్రాజెక్ట్. 195 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాల్సింది.. 91 టీఎంసీలకు తగ్గించి, నిర్వాసితులను గోదావరిలో ముంచేశావు కదా. పోలవరం పాపాలన్నింటికీ జగన్ రెడ్డి నిర్ణయాలే కారణం. వరద వచ్చే సమయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రైతులకు సమాధానం చెప్పాలి'' అని ఆయన అన్నారు.
పోలవరాన్ని సందర్శించిన జగన్.. ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సందర్శనలో భాగంగా తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న జగన్.. తొలుత విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత పోలవరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిని పరిశీలించారు. పురోగతి పనుల గురించి మంత్రి అంబటి రాంబాబు, అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనుల్ని జగన్ స్వయంగా పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ పద్ధతిలో ఇసుకను కూర్చడం వంటి పనులను వీక్షించారు.