NO cheetah on DFO: ప్రజలెవ్వరూ భయపడొద్దు.. చిరుతపులిని అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం: డీఎఫ్వో రామచంద్రరావు
🎬 Watch Now: Feature Video
Palnadu district DFO inspected the cheetah migration area in Gurjala: పల్నాడు జిల్లా గురజాల సమీపంలో గతకొన్ని రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మాడుగుల రోడ్డులోని జియో సిగ్నల్ టవర్ దగ్గర చిరుతపులి సంచరించినట్లుగా టవర్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో దృశ్యాలు నమోదు కావడంతో స్థానికులు.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
గురజాలలో చిరుత సంచారం.. ఈ క్రమంలో స్థానికులు గురజాల పోలీసులకు సమాచారం అందిచడంతో నిన్న (మంగళవారం) అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చెరువు దగ్గర చిరుత కాలిముద్రను గుర్తించి.. చిరుత రెండు రోజుల కిందటే సంచరించినట్లు తెలియజేశారు. సీసీ పుటేజీ దృశ్యాలను అటవీ ఉన్నతాధికారులకు పంపగా.. నాలుగేళ్ల వయసున్న చిరుతపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించామని మాచర్ల అధికారులు ప్రకటించారు. అనంతరం ఆ ప్రదేశంలోకి ఎవరూ వెళ్లకూడదని, రాత్రివేళల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని.. నరసరావుపేట డీఎఫ్వో రామచంద్రరావు తెలియజేశారు.
ట్రాప్ కెమెరాలు, ప్రెజర్ ఇంప్రెషన్ ప్యాడ్స్ ఏర్పాటు.. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా డీఎఫ్వో రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ..''గురజాలలో చిరుత సంచరించిన ప్రాంతాన్నిపరిశీలించాం. గత కొద్ది రోజులుగా చిరుత సంచరించిన ఆనవాళ్లను గుర్తించాం. చిరుత సంచరించిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు, పాదముద్రల సేకరణకు ప్రెజర్ ఇంప్రెషన్ ప్యాడ్స్ ఏర్పాటు చేశాం. మరికొన్ని రోజులు ట్రాప్ కెమెరాలు ఉంచి విజువల్స్ పరిశీలిస్తాం. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదు. చిరుతపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం.'' అని ఆయన అన్నారు.