అమరావతి రైతుల భారీ బహిరంగ సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
🎬 Watch Now: Feature Video
Amaravati Farmers Huge Public Meeting: జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మొదలైన అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ రోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మైదానంలో 2014లో నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నందున అమరావతిపై జగన్ ప్రభుత్వ కుట్రలు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పరిరక్షణ సమితి నిర్ణయించింది. సభకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గుంటూరు పోలీసులకు దరఖాస్తు చేశారు.
సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు తెలిసింది. పొత్తు ప్రకటన తర్వాత ఇద్దరు అగ్రనేతలూ ఒకే వేదిక మీదకు రానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అమరావతిని వ్యతిరేకిస్తున్న వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరుకానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీల నేతలతో పాటు దళిత సంఘాలు, వివిధ కుల సంఘాల నేతలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆహ్వానించారు.