Vijayawada West Bypass Phase-4 Works: విజయవాడ వెస్ట్ బైపాస్‌లో భాగంగా అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఫలితంగా బెజవాడలో కాలు పెట్టకుండానే అమరావతికి చేరుకునే అతి దగ్గరి మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వంతెన రాజధాని అభివృద్ధికి కూడా బూస్టింగ్ ఇవ్వనుంది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఈ అతిపెద్ద వంతెనకు సంబంధించిన దృశ్యవీక్షణం ఆకట్టుకుంటోంది. కనుచూపు మేరలో నీలిరంగుతో నీటి ప్రవాహం. కృష్ణమ్మకు దారిచ్చి పక్కకు జరిగినట్లు కనిపించే కొండలు, పచ్చని పంట పొలాలు ఓ వైపు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరోవైపు. మధ్యలో ఉన్న ఈ బాహుబలి బ్రిడ్జి కృష్ణమ్మకు వడ్డానంలా ఉంది.
కృష్ణా నదిపై భారీ బాహుబలి బ్రిడ్జి: విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్‌గేట్ వరకు మరో 17.8 కిలోమీటర్ల మార్గాన్ని ఎన్హెచ్ఏఐ(NHAI) రూ.1,546 కోట్లతో నిర్మిస్తోంది. ఈ మార్గంలో కృష్ణా నదిపై భారీ బాహుబలి నిర్మాణం జరుగుతోంది. గొల్లపూడి వద్ద ప్రారంభమయ్యే ఈ వంతెన అమరావతిని దేశంలోని మిగిలిన హైవేలతో అనుసంధానిస్తుంది. వెస్ట్ బైపాస్‌లో ప్యాకేజీ -4గా నిర్ణయించి దీన్ని నిర్మాణ బాధ్యతలను నవయుగ, అదానీ గ్రూప్‌లకు అప్పగించారు. 2021 నిర్మాణ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు అత్యంత వేగంగా సాగిస్తున్నాయి. గొల్లపూడి సమీపం నుంచి వెంకటపాలెం వరకు 3.1 కిలోమీటర్ల మేర నిర్మాణం దాదాపు పూర్తయింది. చిన్నఅవుటుపల్లి నుంచి వచ్చే బైపాస్‌తో బ్రిడ్జిని ఇటీవల అనుసంధానించారు. వాహనాల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు.
అమరావతి నిర్మాణ పనులు - టెండర్లకు ఈసీ అనుమతి
53 భారీ పిల్లర్లతో నిర్మాణం: ఈ బాహుబలి బ్రిడ్జి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే అతిపెద్ద వంతెనగా గుర్తింపు పొందింది. ఎగువ నుంచి ఉద్ధృతంగా వస్తున్న కృష్ణమ్మని తట్టుకుని బలంగా నిలబడేలా 53 భారీ పిల్లర్లతో పక్కపక్కనే 2 వరుసల్లో వంతెనను నిర్మించారు. సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంతో తయారు చేసిన సెగ్మెంట్లను భారీ లాంఛర్ల సాయంతో బ్రిడ్జి పిల్లర్ల మధ్య అమర్చారు. అమరావతి నడిబొడ్డు నుంచి వెళ్లే ఏకైక జాతీయ రహదారిలో ఈ వంతెన ఒక భాగం. చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే ఈ వంతెన పైనుంచి ప్రయాణించనున్నాయి.
అక్కడ కాలు పెట్టకుండానే అమరావతికి: అమరావతికి వచ్చే వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు విజయవాడ మీదుగా వస్తూ గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచిచూడాల్సి వస్తుంది. వంతెన అందుబాటులోకి వస్తే గొల్లపూడి నుంచి నిమిషాల వ్యవధిలోనే సచివాలయానికి చేరుకోవచ్చు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చేవారు సైతం చిన్నఅవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కితే బెజవాడలో కాలు పెట్టకుండానే తక్కువ సమయంలోనే అమరావతికి వెళ్లొచ్చు. ఏప్రిల్ నెలాఖరుకు వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రకృతిని ఆస్వాదిస్తూ పశ్చిమ బైపాస్‌పై రయ్ రయ్ - సాకారం కాబోతున్న దశాబ్దాల కల
అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం - Central on Amaravati ORR