Advocate Murder in Addanki: నమ్మించి రాజీకి పిలిచాడు.. హతమార్చి పొలంలో పూడ్చేశాడు - crimes in andhra pradesh
🎬 Watch Now: Feature Video
Advocate Murder in Addanki: విజయవాడకు చెందిన విఠల్ బాబు అనే న్యాయవాదిని పొలం తగాదాల నేపథ్యంలో కమల్ బాబు అనే వ్యక్తి హత్య చేశాడు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామ పొలాల్లో శవాన్ని పూడ్చినట్లు గుర్తించిన పోలీసులు ఘటనాస్థలిలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లాలోని బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన న్యాయవాది విఠల్ బాబు 20 ఏళ్లుగా విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. సొంత గ్రామంలో తనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన తోటకూర కమల్ బాబుకు ఆ భూమిని కౌలుకు ఇచ్చారు. అందులో 2 ఎకరాల భూమిని కమల్ బాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ విఠల్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 26వ తేదీ కోర్టు వాయిదా ఉండటంతో అద్డంకి వెళ్లిన విఠల్ బాబును రాజీపడదామని నమ్మించిన కమల్ బాబు.. బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేశాడు. వాయిదాకు వెళ్లిన విఠల్ బాబు రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కమల్ బాబుపై అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే చంపినట్లు అంగీకరించాడు. కమల్ బాబుని వెంట పెట్టుకొని పూడ్చిన స్థలాన్ని గుర్తించి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.