గూడ్స్ రైలు నుంచి విడిపోయిన వ్యాగన్లు.. నౌపడా జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం - దేశంలో రైలు ప్రమాదాలు
🎬 Watch Now: Feature Video
Wagons Separated From Goods Train: ఇటీవల చోటు చేసుకుంటున్న రైళ్ల ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న గూడ్స్ రైళ్ల ప్రమాదాలతో ప్రతి ఒక్కరూ కలవరపడుతున్నారు. మంగళవారం అనంతపురం, శ్రీకాకుళంలో జరిగిన సంఘటనలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. రైల్వే సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యాన్ని తొందరగా గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది.
గూడ్స్ బండి నుంచి విడిపోయిన 46 వ్యాగిన్లు : అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామ సమీపంలో బెంగళూరు నుంచి బళ్లారి వైపుగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి 46 వ్యాగన్లు విడిపోయాయి. రైల్వే సిబ్బంది రైలు ఇంజన్‌కు వ్యాగన్లను సక్రమంగా అమర్చకపోవడంతో వ్యాగన్లు విడిపోయినట్లు గూడ్స్ డ్రైవర్లు, గార్డ్ తెలిపారు. గూడ్స్ వెనుక వైపు ఉన్న రైల్వే గార్డ్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే గార్డ్ సిగ్నల్‌తో గూడ్స్ బండిని డ్రైవర్లు ఆపేశారు. అనంతరం విడిపోయిన 46 వ్యాగన్లను తిరిగి జతపరిచిన అనంతరం రైలు బయలుదేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
నౌపడా జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి భువనేశ్వర్‌కి వెళ్తున్న గూడ్స్ రైలు.. టెక్కలి - నౌపడా ఆర్ అండ్ బీ రహదారి వద్ద గేటు వేయకపోవటంతో అది గమనించిన రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. కాసేపటికి రైలు హారన్ శబ్దం విని తేరుకున్న గేట్ మెన్ గేటును వేశారు. తనకు ఎటువంటి సమాచారం అందలేదని గేట్ మెన్ గూడ్స్ రైలు డ్రైవర్లకు తెలిపారు. ఈ చర్యతో రైల్వే సిబ్బంది తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.