Ayyanna fire on police officers: గంజాయి రవాణాపై పోలీసులవి అబద్ధాలు.. ఇవిగో నిజాలు: అయ్యన్న పాత్రుడు - Ayyanna Patrudu news
🎬 Watch Now: Feature Video
Ayyanna Patrudu fire on cm Jagan and Visakha Police Commissioner: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై, అన్ని జిల్లాల ఎస్పీలు, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌పై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తరువాత ఉత్తరాంధ్ర పోలీసు అధికారులు.. గంజాయి నివారణపై సమావేశమవ్వటం ఒకవైపు హాస్యస్పాదంగా ఉన్నా, మరోవైపు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి విషయంలో అధికారులు అన్నీ అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు. గంజాయి అంతా ఒడిశా రాష్ట్రం నుంచే రవాణా జరుగుతోందని చెప్పటం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. అసలు ఈ గంజాయిని ఎవ్వరు పండిస్తున్నారో..? ఎవరు అమ్ముతున్నారో..? యువత ఎందుకు నిర్వీర్యం అవుతున్నారో..? అందరికీ తెలుసని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపుదాం.. ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని నెలలుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై రెండు రోజులక్రితం (మంగళవారం) విశాఖపట్టణం జిల్లా నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ నేతృత్వంలో గంజాయి సాగుపై, రవాణాపై, వినియోగంపై.. విశాఖపట్టణం రేంజ్ డీఐజీతో, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో కమిషనరేట్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉత్తరాంధ్రలో జరుగుతున్న గంజాయి వ్యాపారంపై, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుంచి విశాఖ మీదుగా గంజాయి రవాణా రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతోందని అధికారులు మీడియాకు తెలియజేశారు.
యూత్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, గంజాయి రవాణా విషయంలో కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''నర్సీపట్నంలో గంజాయి కేసులను విచారించే కోర్టును ఏర్పాటు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నివారణ కోసం ప్రత్యేక టీంను నియమించాలి. ఏజెన్సీలో ఉన్న 12 పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలి. నాలుగేళ్ల తర్వాత ఉత్తరాంధ్ర పోలీసు అధికారులు గంజాయి నివారణపై సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ గంజాయి అంతా ఒడిశా నుంచి రవాణా జరుగుతోందని తోసేస్తున్నారు. అసలు.. ఈ గంజాయి ఎవ్వరు పండిస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు. యువత ఉద్యోగాలు లేక, పరిశ్రమలు రాక విలవిలాడుతున్నారు. చివరికి ఏం చేయాలో తెలియక గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్నారు'' అని ఆయన అన్నారు.
జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు..?.. అనంతరం అల్లూరి జిల్లా ముంచింగ్ ఫుట్ వద్ద 840 కేజీలు గంజాయి పట్టుకుని.. నలుగురుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలియజేశారు..ఆ నలుగురు ఎవరు..? వారిని పోలీసులు విచారించారా..? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. కేంద్రంలోని నార్కోటిక్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే.. గంజాయిలో ఏపీ నెంబర్.1గా ఉందని తేల్చారన్నారు. 2021లో 7.5 వేల టన్నుల గంజాయిని సీజ్ చేస్తే.. అందులో 2 లక్షల కిలోలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే చెందిందని అధికారులు తేల్చి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో సీఎం జగన్.. గంజాయి నిర్మూలనకు ఏ చర్యలు తీసుకున్నారు..? యువతకు ఏం చేశారు..? రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పారా..? అని అయ్యన్న ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా నర్సీపట్నంలో గంజాయి కేసులు విచారించే కోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.