Mouth Guard Benefits : ఈ రోజుల్లో చాలా మంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఒకరు గురక పెడతారు. ఇంకొందరు పళ్లు కొరుకుతుంటారు. ఇలాంటి నిద్ర సంబంధిత(Sleeping Problems) సమస్యలతో.. బాధితులకు నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. పక్కన ఉన్నవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు నివారణకు.. "మౌత్ గార్డ్" వినియోగిస్తూ ఉంటారు. మరి.. నిద్రలో దానిని ధరించడం సురక్షితమేనా? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మౌత్ గార్డు అంటే : మౌత్‌గార్డ్ అనేది ఒక దంత పరికరం. దీన్నే 'నైట్‌గార్డ్', 'స్ప్లింట్', 'బైట్ స్ప్లింట్', 'స్పోర్ట్స్ గార్డ్' లేదా 'గమ్ షీల్డ్' అని కూడా పిలుస్తారు. ఇది దవడల ఆకారంలో ఉండి.. ఎగువ, దిగువ దవడలోని అన్ని దంతాలకు ఫిక్స్ చేసుకునేలా ఉంటుంది. నిద్ర సంబంధింత సమస్యల నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. అయితే.. వీటిల్లో పలు రకాల మౌత్ గార్డులు ఉన్నాయి. దంతవైద్యుని సూచన మేరకు వీటిని వాడాల్సి ఉంటుంది.
బ్రక్సిజం మౌత్‌గార్డ్ : బ్రక్సిజం అంటే మీరు నిద్రపోతున్నప్పుడు దంతాలు కొరకడం లేదా పళ్లు నూరడం. నిద్రలో నిరంతరాయంగా పళ్లు నూరుతుండడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. అదే మౌత్ గార్డ్ ధరించి నిద్రపోతే.. మీ దంతాలకు రక్షణతోపాటు హాయిగా నిద్రపోవచ్చు. అయితే.. ఇది స్టోర్‌లో కొనడం కన్నా.. మీకు తగినట్టుగా చేయించుకుని వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గురక మౌత్‌గార్డ్ : చాలా మందిలో నిద్రలేమికి కారణమయ్యే సమస్య గురక. ఈ సమస్య నివారణకు మౌత్ గార్డ్ వాడుతుంటారు. దీనివల్ల సమస్యకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని చెబుతారు. ఫలితంగా.. గురక పెట్టే వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నిద్రపోవచ్చు.
స్లీప్ అప్నియా మౌత్‌గార్డ్ : ఇది నిద్ర సమస్యలో చాలా తీవ్రమైనది. దీనివల్ల.. నిద్రలో మనిషికి తెలియకుండానే కాసేపు ఆక్సీజన్ తీసుకునే ప్రక్రియ నిలిచిపోతుంది. దాంతో.. అనివార్యంగా మెలకువ వచ్చేస్తుంది. మళ్లీ కాసేపటి తర్వాత నిద్రలోకి జారుకోగానే.. ఇదే పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల.. నిద్ర సరిగా లేక, పగటిపూట నిస్సత్తువగా ఉంటారు. ఈ సమస్యను నివారించేందుకు కూడా మౌత్ గార్డ్ ఉంది.
క్రీడల్లో మౌత్‌గార్డ్ : బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, రగ్బీ.. వంటి క్రీడాకారులు కూడా ఈ మౌత్ గార్డ్‌ను వాడుతారు. ఊహించని దెబ్బలతో దంతాలకు గాయాలు కాకుండా.. విరిగిపోకుండా ఈ గార్డ్ కాపాడుతుంది.
Daytime Sleepiness Avoid Tips in Telugu : లంచ్ తరువాత నిద్రొస్తోందా బుజ్జీ..! ఇలా ట్రై చేయ్
నిద్రిస్తున్నప్పుడు మౌత్ గార్డ్ సురక్షితమేనా? : ఈ మౌత్‌గార్డ్ పెట్టుకొని నిద్రపోవడం మంచిదేనా? అనే ఆందోళన.. దాన్ని వాడుతున్న వారందరికీ ఉంటుంది. అయితే.. నిపుణులు చెబుతున్న మాట ఏమంటే.. ఇది సురక్షితమేనని. నిద్రలేమిక సమస్యలకు చెక్ పెట్టడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే.. మౌత్ గార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
ఓపిక అవసరం : సాధారణంగా నైట్ గార్డులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదట అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ, కాలక్రమేణా వాటిని సర్దుబాటు చేసుకోవచ్చు. సర్దుబాటు వ్యవధిలో ఓపికగా, పట్టుదలతో ఉండటం చాలా ముఖ్యం.
శుభ్రంగా ఉంచండి : నైట్‌గార్డ్‌ను ఉపయోగించే ముందు, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. తేలికపాటి సబ్బు లేదా డెంచర్ క్లీనర్ వాడండి. క్లీన్ గార్డు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో, దంత ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
సున్నితంగా : నైట్ గార్డ్స్ సున్నితంగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా వాడాలి. గార్డును వంచడం లేదా మెలితిప్పడం లాంటివి చేస్తే దాని ఫిట్ ప్రభావం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
రెగ్యులర్ చెకప్ : దంతవైద్యుడు మీ దంతాల స్థితిని, గార్డ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే.. మార్పులు సూచించవచ్చు. అందువల్ల.. ఏదైనా తేడాగా అనిపిస్తే డాక్టర్‌ను కలవాలి.