వంటకాల రుచి పెంచే ఉప్పు మనకు మేలు చేసే పేగుల్లోని బ్యాక్టీరియాకు పిడుగుపాటుగా పరిణమిస్తోంది మరి. ఉప్పు అధికంగా తినటానికీ అధిక రక్తపోటుకూ సంబంధం ఉండటం తెలిసిందే. అంతేకాదు, దీంతో మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి స్వీయ రోగనిరోధక సమస్యలూ త్వరగా ముదురుతుంటాయి.
పేగుల్లో ల్యాక్టోబాసిలస్ అనే మంచి బ్యాక్టీరియాకు ఉప్పు ప్రమాదకరంగా పరిణమిస్తుండటమే దీనికి కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాల్లో ఉండే ల్యాక్టోబాసిలస్ బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మందులను తట్టుకునే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవటంలోనూ, ల్యూపస్ బాధితుల్లో కిడ్నీలో వాపు తగ్గటంలోనూ పాలు పంచుకుంటుంది.
అయితే ఉప్పు ఎక్కువగా తినటం మూలంగా పేగుల్లో ల్యాక్టోబాసిలస్ బ్యాక్టీరియా మరణిస్తున్నట్టు తాజాగా బయటపడటం గమనార్హం. కేవలం 2 వారాల్లోనే ఈ బ్యాక్టీరియా తుడిచిపెట్టుకుపోతుండటం విశేషం. అంతేనా? టీహెచ్17 అనే వాపు కారక రోగనిరోధక కణాల పనితీరునూ ఉప్పు ప్రేరేపితం చేస్తోంది. ఫలితంగా అధిక రక్తపోటు, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలకు ఊతమిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గించటంపై దృష్టి పెట్టటం మంచిదని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: హృదయలయలు మార్చే సంగీతంతో ఆరోగ్యం!