సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు పెద్దలు. అంటే మనకున్న అన్ని అవయవాల్లోకెల్లా.. కళ్లు ప్రధానమైనవని అర్థం. మన రోజువారీ దినచర్యలో సాయపడే, జీవితంలో ఎంతో ప్రధానమైన కళ్లను చాలా మంది సరిగ్గా పట్టించుకోరు. కొన్ని పనులు చేయటం వల్ల కళ్లకు ఇబ్బంది అని తెలిసినా.. వాటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. ఇలా చేయడం వల్ల చివరికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.
కార్యాలయాల్లో కంప్యూటర్ ముందు పని చేయడం, ఇంటికి వచ్చాక గంటల తరబడి సెల్ ఫోన్ వాడటం నేటి ఆధునిక జీవన శైలిలో భాగం. ఇవన్నీ మన కళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిసినా.. పెద్దగా పట్టించుకోం. కళ్లు మసకబారటం, దూరం, దగ్గరి వస్తువులు కనబడకపోవడం వంటివి అయ్యే వరకు వాటిని అశ్రద్ధ చేస్తాం. గంటల తరబడి కంప్యూటర్, సెల్ఫోన్ల ముందు గడపటం, నిద్రలేమి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు రావటం, చూపు మందగించడం, కళ్లల్లో మంటలు, నీరు కారటం వంటివి.. క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వేధిస్తాయి. మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కళ్లను ఎలా కాపాడుకోవాలి? వాటి ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన ఆహారం, నిద్ర అవసరం :
కళ్లను కాపాడుకోవడానికి, వాటి ఆరోగ్యానికి ముఖ్యంగా ఆహార అలవాట్లు, నిద్ర పోయే విధానం మీద ఫోకస్ చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా మంచి చేస్తాయి. వీటితో పాటు తగినంత నిద్ర కూడా కళ్లకు అవసరం. ఒక టైమ్‌కు తిని పడుకోవడం.. మన ఒంటికే కాదు, కంటికీ ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలి.
ఈ రెండింటితో పాటు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. ఇది కూడా పరోక్షంగా మన కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం, తగినంత నిద్రతో పాటు వ్యాయామం చేయడం కంటికి చాలా ముఖ్యం. ఈ మూడూ చేయడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇవే కాకుండా.. చాలా మంది రాత్రి పూట చీకటి గదిలో బ్రైట్ స్క్రీన్ పెట్టి సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. ఇది కూడా కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్లు పొడి బారటమే కాకుండా.. కంటి నరంలో మాక్యులా అనే పదార్థం దెబ్బతింటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
- కంప్యూటర్, మొబైల్ వాడుతున్నప్పుడు గానీ, టీవీ చూస్తున్నప్పుడు గానీ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరం చూడాలి.
- ఎండలో బయటికి వెళ్లినప్పుడు యూవీ కిరణాల ప్రభావం కళ్లపై పడకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.
- పరిశ్రమలు, రసాయనాల తయారీలో పనిచేసేటప్పుడు తప్పని సరిగా కళ్లకు రక్షణ అద్దాలు ధరించాలి. ఫలితంగా గాయాలవకుండా కాపాడుకోవచ్చు.
- కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే సిట్రస్ జాతి పండ్లు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి.
- ఏటా తప్పని సరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
- పాత మేకప్ సామగ్రిని వాడకపోవడం ఉత్తమం.
- ఎండాకాలంలో పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల పొడి బారటం నుంచి తప్పించుకోవచ్చు.
- కాంటాక్ట్ లెన్స్ వాడేవారు.. వాటిని పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- కంటిచూపు మెరుగు పడేందుకు క్యారెట్ తీసుకోవాలి.
- స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మానేయ్యాలి.
- బీపీ, షుగర్ లాంటి వ్యాధిగ్రస్థుల్లో కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. బీపీ సడెన్‌గా పెరగడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది. అలాంటి వారు.. తమ కళ్లను ఏడాదికోసారి డాక్టర్ దగ్గరికెళ్లి చెకప్ చేయించుకోవాలి