Home Remedies To Relieve Nasal Congestion: వింటర్ సీజన్ ప్రారంభం కాగానే చాలా మందిని ముక్కు దిబ్బడ సమస్య వెంటాడుతుంది. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా జలుబు చేసి ఈ సమస్య తలెత్తుతుంది. కొంత మందిలో జలుబు కనిపించదు. కానీ, ముక్కు దిబ్బడ ఉంటుంది. ముక్కులో ఉండే సున్నితమైన త్వచాలు ఉబ్బడం వల్ల ముక్కు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా కొంత మందిలో ముక్కు నుంచి నీరు కారడం వంటి సమస్యలను మనం చూస్తుంటాం. చలికాలంలో ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముక్కు దిబ్బడను తొలగించే చిట్కాలు..
- ముక్కు దిబ్బడ, జలుబు చేస్తే ఎక్కువ మంది వేడి నీటితో ఆవిరి పట్టమని సలహా ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన చిట్కానే. కానీ, కొంతమంది బామ్ వంటివాటిని వేడి నీటిలో వేసి ఆవిరి పడుతుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదంగా మారొచ్చు. కేవలం నీళ్లు లేదా పసుపు కలిపిన నీటితో ఆవిరి పడితే చాలు.
- యూకలిప్టస్ ఆయిల్‌ను రెండు, మూడు చుక్కలుగా ఏదైనా వస్త్రం మీద వేసుకొని లేదా వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చినా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటి వాసన పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ సమస్య తగ్గుతుంది.
- వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. అల్లం, తేనె కలుపుకుని టీ లేదా వేడి నీటిలో యాపిల్ సిడార్, వెనిగర్ కలిపి తాగినా ముక్కు దిబ్బడ నుంచి బయట పడవచ్చు.
- మంచి హ్యుమిడిఫయర్‌ని మీ దగ్గర తెచ్చిపెట్టుకోండి. దీని నుంచి వచ్చే వేడి ఆవిరి ముక్కు దిబ్బడనే కాదు గొంతులో గరగర, దగ్గు, సైనస్ సమస్యల నుంచి గట్టేక్కిస్తుంది.
- పావు గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, గొంతు లోపలికి వెళ్లేలా పుక్కిలించి ఊయండి. రోజులో ఇలా 3 లేదా 4 సార్లు చేయడం వల్ల సూక్ష్మజీవులను చనిపోయి.. తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి జలుబు లక్షణాలు ఉన్నవారైనా ఇలా ప్రయత్నించొచ్చు.
- ముక్కు దిబ్బడ, జలుబు సమస్యలతో బాధపడేవారు.. రెండు, మూడు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి.
- ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా నలిపి తినాలి. లేదా వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని కలిపి తాగినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
- మరుగుతున్న నీటిలో పెప్పర్‌మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు.
- నాన్‌వెజ్ తినేవారు చికెన్ సూప్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ముక్కు దిబ్బడ, జలుబు సమస్యతో బాధ పడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటి నీరు తీసుకోకూడదు. గోరు వెచ్చని నీటినే మాత్రమే తీసుకోవాలి.
చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? - ఈ టిప్‌తో మీ జుట్టు నిగనిగలాడిపోద్ది!
మెంతులతో ఎన్ని లాభాలో- మొటిమలకు చెక్- మీ ముఖంలో గ్లో పక్కా!
ముడి తేనెతో మెరుగైన ఆరోగ్యం- దీర్ఘకాలిక వ్యాధులు దూరం! కానీ ఆ విషయంలో జాగ్రత్త!!