Good Parenting Tips in Telugu : ప్రస్తుత ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. దీంతో.. టాప్‌లో ఉన్నవారికే ఉద్యోగ రంగంలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ పరిస్థితులతో తమ పిల్లలు చదువులో అందరికన్నా ముందుండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. తరగతిలో చెప్పే పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు. అయితే.. పిల్లలు ఆ స్థాయిలో ఎదగాలని కోరుకుంటే సరిపోదు. నిరంతరం వారిని ఒత్తిడి చేసినా ఫలితం ఉండదు. తల్లిదండ్రులు వాస్తవాలను అర్థం చేసుకొని కొన్ని టిప్స్ పాటిస్తేనే.. వారిని ప్రతిభావంతులుగా చూడగలుగుతారంటున్నారు నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒత్తిడి పెంచవద్దు : తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో ఒత్తిడి తేకూడదంటున్నారు నిపుణులు. పిల్లలు చదువులో వెనుకంజలో ఉన్నప్పుడు.. వారిని మరింత ఒత్తిడికి గురిచేయకుండా వారితో కమ్యూనికేషన్ పెంచుకోవాలంటున్నారు. వారు ఎందుకు వెనకబడుతున్నారో.. మెల్లగా రాబట్టి, దాన్ని ఎలా సరిచేయాలో చూడాలని చెబుతున్నారు. అంతేతప్ప.. ఒత్తిడిచేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. పేరెంట్స్ - పిల్లల మధ్య కమ్యూనికేషన్ ఎంత స్పష్టంగా ఉంటే.. వారి మధ్య అనుబంధం అంత దృఢం అవుతుందట. అంతేకాదు.. దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహభావం కూడా రెట్టింపు అవుతుందని.. తద్వారా పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు బోలెడన్ని విషయాలు నేర్చుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
టైం టేబుల్ సెట్ చేయాలి : పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. వారికి పరీక్షలున్నప్పుడు ముందుగానే ఒక టైం టేబుల్‌ను క్రియేట్ చేయాలి. అందులో.. అన్ని సబ్జెక్టులను ప్రాక్టీస్ చేసుకునేలా తగినంత సమయం కేటాయించాలి. అంతేకాకుండా మధ్యమధ్యలో క్రీడలు, అభిరుచులకు సమయం ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు తగినంత నిద్ర ఉండేలా ఆ టైం టేబుల్లో సమయం సెట్ చేయాలి.
Parenting tips : ఈ చిన్న పనులే మిమ్మల్ని పిల్లలకు దగ్గర చేస్తాయి!
ఆ లక్ష్యాన్ని నిర్దేశించాలి : పిల్లలతో క్లోజ్‌గా ఉంటూ.. వారు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి. అనుకున్నదే తడవుగా ఫుల్ స్కోర్ చేయాలని అనవసరమైన ఒత్తిడిని పెట్టొద్దనే విషయం గుర్తుంచుకోవాలి. వారి టాలెంట్‌కు తగ్గ లక్ష్యాన్ని మాత్రమే సెట్ చేయండి. ముందుగా ఏ పని చేయాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలి? లాంటి విషయాలను వారికి నేర్పించాలి. అలాగే.. వారి బలహీనత, ఆసక్తిని బట్టి ఒక సబ్జెక్టును ఎంత టైమ్ వరకు చదవాలో ఒక ప్రణాళికను సెట్ చేయండి.
ఇంకా మరికొన్ని చేయండి..
- ఇంట్లో మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు వారి ఏకాగ్రతకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాలి.
- ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతోనే గడపాలని చెప్పకండి. బోర్ కొడుతుంది. కొన్ని ఆసక్తికరమైన కథల పుస్తకాల వంటివి అందించండి.
- పరీక్షకు ముందు పిల్లలకు సరైన ఆహారాన్ని అందిస్తున్నామో లేదో ఓసారి చెక్ చేసుకోండి. అలాగే ఆహారంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోండి.
- చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా.. చివరకు ఫెయిల్ అయినా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టొద్దు, కొట్టొద్దు.
- ఏం పర్వాలేదని భుజం తట్టండి. వచ్చేసారి మంచిగా ప్రయత్నం చేద్దాం అని భరోసా ఇవ్వండి. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అందుకున్న వారి స్టోరీలు చెప్పండి.
- ఒకవేళ మంచి మార్కులు వచ్చాయనుకోండి.. పిల్లలను తప్పనిసరిగా అభినందించండి. ఇలాగే ముందుకు సాగమని చెప్పండి.
- చివరగా.. ఈ ప్రపంచంలో మీ అమ్మాయి/అబ్బాయి లాంటి మరో వ్యక్తి లేరు. వారు వారే. ఎవరితోనో పోలిక లేదని మీరు గుర్తించండి. ఎవ్వరితోనూ వారిని పోల్చకండి. పలానా వారిలా తయారు కాకపోతే ఎందుకూ పనికిరావు అనే మాటలు అస్సలే మాట్లాడకండి.
- ఉద్యోగం.. కుటుంబ బాధ్యతల పేరు చెప్పి.. పిల్లలకు సమయాన్ని కేటాయించకుండా మీరు ఉండకండి. వారితో ప్రతిరోజూ కొంత సమయాన్ని తప్పక గడపండి.
- ఈ పనులు చేసి చూడండి.. తప్పకుండా మీ పిల్లలో మార్పును చూస్తారు అని నిపుణులు చెబుతున్నారు.
మీ టీనేజ్ పిల్లల ప్రవర్తన భయపెడుతోందా? డోన్ట్ వర్రీ ఈ టిప్స్ పాటించండి!