వర్ష భావంతో సాగునీరు అందక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందుచూపు లేకపోవడం కారణంగా సాగునీటికి అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లలో నీరు ఇంకిపోయింది. ఫలితంగా వేసిన పంటను కాపాడుకోలేక వదిలేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే ముందుచూపుతో పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని ఉంటే సాగునీటి సమస్య కొంతమేరకైనా తీరుతుందని అధికారులు చెబుతున్నారు.
కడప జిల్లాలో ఒక లక్ష 22 వేల 310 హెక్టర్లల్లో ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. వీటికి సకాలంలో నీటి తడులు అందించ లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి రైతు తన పొలంలో ఎక్కడో ఒక చోట చిన్న కుంట ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రాయితీని కల్పించనుందని అధికారులు తెలుపుతున్నారు. అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు రైతులు 532 చిన్నకుంటలు నిర్మించుకున్నారు. ఇంకా 172 నిర్మించుకోవాల్సి ఉంది. ఇక పెద్ద కుంటలు 29 చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఉద్యాన శాఖ 5.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి