పులివెందులలోని తమ ఇంటివద్ద ఈ నెల 10వ తేదీన రెక్కీ నిర్వహించారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. డీఎస్పీ శ్రీనివాసులు మణికంఠను ప్రశ్నించారు. వివేకా ఇంటి ప్రాంతంలో బైకుపై రెండుసార్లు ఎందుకు తిరగాల్సి వచ్చింది, కాంపౌండ్‌లోకి వెళ్లడానికి కారణమేంటనే అంశాలు ఆరా తీశారు. అద్దె గదుల కోసం వెదుకుతూ అక్కడి వెళ్లినట్లు చెప్పగా.. వివేకా ఇంటి ప్రాంగణంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని డీఎస్పీ ప్రశ్నించారు. దీనిపై మణికంఠరెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు.. బైండోవర్ కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లి, ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో బైండోవర్ చేయించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భద్రత కల్పించాలన్న సునీత విజ్ఞప్తి మేరకు.. వివేకా ఇంటి వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
వివేకా ఇంటి వద్ద రెక్కీ చేయలేదని మణికంఠరెడ్డి చెబుతున్నాడు. పులివెందుల ప్రాంతంలో జరిగే సీఎం సభలు, వైకాపా కార్యక్రమాలు సహా పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లు చేస్తుంటానని.. అందులో భాగంగానే వివేకా ఇంటి పరిసరాలకు వెళ్లానని అంటున్నాడు. అంతకుమించి తనకు ఇంకేమీ తెలియదంటున్నాడు.
వివేకా హత్య కేసులో 69వ రోజు కడప, పులివెందుల ప్రాంతాల్లో సీబీఐ విచారణ కొనసాగింది. తుమ్మలపల్లి యురేనియం ఉద్యోగి, ఎంపీ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న ఉదయ్ తండ్రి ప్రకాశ్‌రెడ్డిని కూడా విచారణకు పిలిచారు. వివేకా మృతదేహానికి కుట్లు వేసి, శుభ్రం చేశారనే కారణంతో ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయ్ ఇంటివద్ద ఉండే బాబుల్‌రెడ్డి దంపతులను కూడా విచారణకు పిలిచారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి, చెప్పుల దుకాణం యజమాని మున్నాను సీబీఐ విచారించింది. ఇక కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌ను సీబీఐ లోతుగా ప్రశ్నించింది. సునీల్ బంధువు భరత్‌కుమార్ యాదవ్‌ను కూడా విచారణ చేశారు. సుంకేశుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డి కారును అధికారులు సీజ్ చేశారు.
ఇదీ చదవండి:
KRMB: డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పనే చేశారు: కృష్ణా బోర్డు నివేదిక