మార్చి 15, 2019న మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. పులివెందులలోని ఆయన నివాసంలో హత్యకు గురైనా... పోలీసులు ఇప్పటివరకు హంతకులు ఎవరనేది తేల్చలేక పోయారు. ఇప్పటికే కేసులో అనుమానితులైన వైకాపా, తెదేపా నాయకులతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను సైతం సిట్ ప్రశ్నించింది. దాదాపు 1300 మంది అనుమానితులను విచారించారు. కానీ ఇంతవరకు కేసు ఛేదించలేక పోయారు. కాగా ముందునుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన కొమ్మా పరమేశ్వర్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వివేకా హత్య జరిగిన రోజు కొమ్మా పరమేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడం, కడపలోని హరిత హోటల్లో తెదేపా నేతతో మంతనాలు జరపడం వంటి సంఘటనలు అనుమానాలకు తావిస్తోంది.
104 గదితో సంబంధం ఏంటి....
వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలు పరమేశ్వర్ రెడ్డికి తెలుసనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అదుపులోకి తీసుకుని విచారించారు. గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు కూడా చేయించారు. ఇదే సమయంలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. అయితే సన్‌రైజ్ ఆసుపత్రి నుంచి హరిత హోటల్‌కు వచ్చిన పరమేశ్వర్‌రెడ్డితో ఏం మాట్లాడారనే దానిపై సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. 104 గదిలో కాసేపున్న తెదేపా నేత... తర్వాత గది అవసరం లేదని హోటల్ బయటే గంట సేపు ఉన్నట్లు హోటల్ నిర్వాహకులు సిట్ అధికారులకు వివరించారు. కాగా సెప్టెంబరు 3న పరమేశ్వర్ రెడ్డి బావ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కూడా పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో పరమేశ్వర్ రెడ్డి కీలక అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.... సిట్ అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని భావిస్తూ... తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వీరిద్దరూ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఈ కేసుపై శనివారం హైకోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే వీలుంది. ఇప్పటివరకు వివేకా హత్య కేసులో దర్యాప్తు వివరాలను కోర్టుకు సమర్పించే వీలుంది. రేపు కోర్టు ఏ మేరకు తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి...నేడే బీసీజీ నివేదిక... రాజధాని రైతుల్లో ఉత్కంఠ