Venkatesh Death in Kuwait: కువైట్ జైల్లో మృతి చెందిన వెంకటేష్ కు భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులు ఉన్నారు. వీరిది పేద కుటుంబం కావడంతో వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే వెంకటేష్ ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని వాటిపై విచారించి వాస్తవాలను తెలపాలని డిమాండ్ చేశారు. వెంకటేష్ మృతదేహాన్ని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులైన తల్లిదండ్రులు ఉండడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
" మేము మా అల్లుడిని కోల్పోయాం. అతను చాలా అమాయకుడు. ప్రభుత్వం మాకు మేలు చేయలేదు. సరైన సమయంలో చర్యలు తీసుకోలేదు.పట్టించుకోలేదు. చివరికి అమాయకున్ని బలి తీసుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారిని ఎలా పెంచి పెద్ద చేయాలి. మాకు దిక్కేది. " -ఎల్లమ్మ, మృతుడి అత్త
" నా భర్తను పొట్టను పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా చంపేయమని చెప్పండి. వారి కసి తీరుతుంది. నా భర్తను చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంకా ఆయన మృతదేహాన్ని ఏం చేస్తారు. కనీసం నా భర్త మృతదేహాన్నైనా మాకు అప్పగించండి. ఇంతకన్నా ఏం కోరుకోవాలి మిమ్మల్ని. తప్పు చేశామని ఇరికించి చివరికి చంపేశారు. "- స్వాతి, మృతుడి భార్య
" మన భారత ఎంబసీకి ఏమీ తెలియదా ? 21రోజులు సమయం తీసుకున్నప్పుడు..ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముద్దాయిగా విచారణలో ఉన్నప్పుడు అతనికి ఏం జరిగినా బాధ్యత మీదే కదా..? ఒకవేళ నేరం రుజువైతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకూ మౌనంగా ఉండి హఠాత్తుగా మీ కుమారుడు చనిపోయాడు అంటే మాకు దిక్కేది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. భారత ఎంబసీ వారు ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే మా కుమారుడు మరణించేవాడు కాదు. " -శ్రీరాములు, మృతుడి తండ్రి.
ఇదీ చదవండి : విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు
Suicide in Kuwait : కువైట్ దేశంలో ముగ్గురిని హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడపజిల్లా వాసి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. కువైట్ దేశంలోని ఆర్ధియా ప్రాంతంలో ఉన్న సెంట్రల్ జైల్లో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. జైల్లో తన శరీరంపై ఉన్న వస్త్రాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గత నెల 25వ తేదీన కువైట్ లోని ఆర్ధియా ప్రాంతంలో ఒకే ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. వారిని వెంకటేశ్ హత్య చేశారనే అభియోగాలతో అక్కడి పోలీసులు పదిరోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. 21 రోజుల కస్టడీ కోసం నాలుగు రోజుల కిందట సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇవాళ వెంకటేశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. వెంకటేశ్ చనిపోయారనే వార్త తెలుసుకున్న కడపజిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు గ్రామానికి చెందిన భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త ముగ్గురిని హత్య చేయలేదని... అక్కడి ప్రభుత్వం కావాలనే తన భర్తపై నేరం మోపిందని వెంకటేశ్ భార్య స్వాతి ఆరోపిస్తోంది. రెండేళ్ల కిందట ఉపాధి కోసం వెంకటేశ్ కుటుంబం కువైట్ కు వెళ్లింది. భర్తను అరెస్ట్ చేసిన తర్వాత.. భార్య స్వాతిని అక్కడి పోలీసులు ఇండియాకు పంపించి వేశారు. కువైట్ పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.తన భర్త మృతదేహాన్ని అప్పగించాలని స్వాతి వేడుకుంటోంది.
జరిగింది ఇదీ...
Kuwait Murder Case: కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు చెందిన వెంకటేశ్, భార్య స్వాతి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. వెంకటేశ్ ఓ ఇంట్లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా...'కువైట్‌లో సేఠ్, అతని భార్య, కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేరే ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న తన భర్త వెంకటేశ్‌పై కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాం. అక్కడ జరిగిన మూడు హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో చేసిన హత్యలకు తన భర్తను శిక్షించడం ఎంతవరకు న్యాయం' అని స్వాతి వారం క్రితమే వివరించారు.
వారం క్రితం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన పిల్లొళ్ల స్వాతి.. దిన్నెపాడు కస్పాలోని ఇంటికి చేరారు. అనంతరం.. ఏ తప్పు చేయని నా భర్తను ఎలాగైనా కాపాడాలని లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించారు. వెంకటేష్ వ్యవహారంపై ఇండియన్ ఎంబసీని అక్కడి తెలుగు వారు ఆశ్రయించగా కడప కలెక్టరేటుకు విషయం చేరింది. బాధితుడి భార్య స్వాతి వివరాలివ్వాలని కలెక్టరేట్ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి.
నా భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని.. అతను ఎలాంటి నేరాలు చేయలేదని జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని స్వాతి చెప్పారు. తన భర్తను ఎలాగైనా కాపాడాలని జిల్లా ఉన్నతాధికారులను ఆమె వేడుకున్నారు. కాగా.. కువైట్‌లో జరిగిన హత్య ఘటనపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆరా తీస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.ఈ విషయంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. కానీ ఇంతలోనే వెంకటేశ్ కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే వార్త తెలిసి అతని భార్య స్వాతి,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెంకటేశ్ ఈ హత్యలు చేయలేదని.. సాక్ష్యాధారాలు లేకనే వారే తమ కుమారుడ్ని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వెంకటేశ్ తండ్రి ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి దిక్కెవరని, నా భర్తను నాకు తెచ్చివండంటూ స్వాతి రోదన చూసినవారి కళ్లు చెమ్మగిల్లాయి.
ఇదీ చదవండి : కువైట్ హత్యల కేసు..ఇండియన్ ఎంబసీని ఆశ్రయించిన తెలుగువారు