వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని తితిదే ఆధ్వర్యంలో ఉన్న పలు ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది. భక్తుల రద్దీకి తగినట్లు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులు ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిచ్చారు.
జిల్లా నలుమూలల నుంచి ఒంటిమిట్ట ఆలయానికి:
కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఆలయమంతా పుష్పాలతో ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలు పోతాయని ఇక్కడి భక్తుల నానుడి.
ప్రత్యేక ఆకర్షణగా రైల్వేకోడూరు, బుడుగుంట పల్లి, పెనగలూరులోని ఆలయాలు:
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వేకోడూరు, బుడుగుంట పల్లి, పెనగలూరులోని ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జమ్మలమడుగులో ప్రత్యేక ఏర్పాట్లు:
జమ్మలమడుగులోని శ్రీ భూదేవి సమేత నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనానికి ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార ప్రవేశం కల్పించడంతో భక్తులు పులకరించిపోయారు. అలాగే తితిదే ఆధ్వర్యంలో ఉన్న నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో.. కరోనా నిబంధనలకు పాటిస్తూ.. ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని.. ఆలయ సిబ్బంది ప్రచారం చేశారు.
సిబ్బంది, భక్తుల మాటల్లో..
స్వామి వారికి ఈ రోజు 3 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాము. అనంతరం 5 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు అవకాశం కల్పించాము.
- ఆలయ పూజారి
ఈరోజు శుక్రవారం కూడా కావడంతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకారంలో చూడడం చాలా ఆనందంగా ఉంది. భక్తులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా దేవస్థానం వారు ఏర్పాట్లను చక్కగా చేశారు.
- స్వామి వారిని దర్శించుకున్న భక్తులు