కడపజిల్లా యర్రగుంట్లలో ఇండియా సిమెంట్ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య దారుణహత్య కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య, అయన సమీప బంధువు శ్రీనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ కడప ఎస్పీ అన్బురాజన్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఏడాది కిందట వెంకటరమణయ్య 10 లక్షల రూపాయలను ముసలయ్యకు వడ్డీకి ఇచ్చాడు. అది ప్రస్తుతం 30 లక్షల వరకు చేరటంతో... వెంకటరమణయ్య నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావటంతో ముసలయ్య ఏం చేయాలో తెలియక హత్య చేయాలని పథకం పన్నాడని ఎస్పీ అన్భురాజన్ తెలిపారు.
"ఏడాది కిందట వెంకటరమణయ్య 10 లక్షల రూపాయలను ముసలయ్యకు వడ్డీకి ఇచ్చాడు. అది ప్రస్తుతం రూ.30 లక్షలకు చేరింది. ముసలయ్య ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను పెట్టుకుని అప్పు ఇచ్చాడు. ప్రస్తుతం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకటరమణయ్య తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవటంతో... ముసలయ్య ఏం చేయాలో తెలియక హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 20న ఉదయం వెంకటరమణయ్యకు ముసలయ్య ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని ఇంటికి రావాలని, ఇంట్లో కూర్చుని సెటిల్ చేసుకుందామని చెప్పాడు. అది నమ్మిన వెంకటరమణయ్య.... ముసలయ్య ఇంటికి పత్రాలతో వెళ్లాడు. ఇద్దరూ కలిసి అప్పులు విషయం మాట్లాడు తుండగానే.... మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పథకం ప్రకారం పెద్ద కర్రలతో ముసలయ్య, ఆయన సమీప బంధువు శ్రీనాథ్ కలిసి వెంకటరమణయ్య తలపై బలంగా కొట్టారు. 60 ఏళ్ల వయసున్న వెంకటరమణయ్య వారి దెబ్బలకు అక్కడే కుప్పకూలి పోయాడు. శవాన్ని ఎలా మాయం చేయాలని ఆలోచించి... మృతదేహం నుంచి వేటకొడవలితో తలను నరికారు. తలను వేరు చేసి టిఫిన్ బాక్సులో పెట్టుకుని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గువ్వలచెరువు ఘాట్ లో పడేశారు. మొండాన్ని మాత్రం నిందితుడు ముసలయ్య ఇంటి ఆవరణలోని బాత్ రూములోనే పూడ్చి పెట్టారు."
-అన్భురాజన్- ఎస్పీ
ఈనెల 20వ తేదీన వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేసి రమణయ్య కనిపించడం లేదని తెలిపారు. ఈనెల 22న అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. వెంకటరమణయ్య ఫోన్‌కు చివరికాల్ ముసలయ్య నుంచి వెళ్లినట్లు గుర్తించి.. అనుమానంతో ఈనెల 24న ఆయన ఇంటికి వెళ్లి విచారిస్తే... నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకున్న ముసలయ్య భయంతో వణికి పోయాడని చెప్పిన ఎస్పీ... పోలీసులు పట్టుకుంటే తీవ్ర అవమానంగా ఉంటుందని... ఆత్మహత్య చేసుకోవడానికి ముసలయ్య నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించారు. ఈ మేరకు సూసైడ్ నోట్ కూడా రాసుకున్నట్లు తెలిపారు. ఈలోపే ముసలయ్యను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఈ సమయంలో కూడా చాలాసార్లు ముసలయ్య ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు జీపు దిగి వాహనం కింద పడిపోవాలని ప్రయత్నం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే తలను ఎందుకు 50 కిలోమీటర్ల దూరంలో వేయాల్సి వచ్చింది... హత్య చేయడానికి వెనక ఇంకా ఎవరున్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: అల్లాడుపల్లెలో పాముల సయ్యాట