కడప జిల్లాలో పురాతన చరిత్రకు జమ్మలమడుగు ప్రాంతం కీలకం. ఇక్కడ అరుదైన శిల్ప సంపద లభించింది. మైలవరంలో జలాశయం నిర్మాణంలో భాగంగా అనేక శిల్పాలు తవ్వకాల్లో లభించాయి. జలాశయ నిర్మాణం అనంతరం పురావస్తు ప్రదర్శనశాలను 1976 అక్టోబరు 9న ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సేకరించిన వస్తువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటపడిన పురాతన వస్తువులను ఒకచోట చేర్చి నీటిపారుదల శాఖకు సంబంధించిన భవనంలో తాత్కాలికంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు అదే భవనంలో మ్యూజియం కొనసాగుతోంది.
13 గ్రామాల నుంచి విగ్రహాల సేకరణ
పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్న వస్తువులు, రాతి విగ్రహాలు సుమారు 13 గ్రామాల నుంచి సేకరించారు. తొండూరు మండలం మల్లేల ప్రాంతానికి చెందిన రాతి స్తంభాలు సైతం ఇక్కడ ఉన్నాయి. మైలవరం ముంపు గ్రామాలతో పాటు వేపరాల, దొమ్మర నంద్యాల, పెద్దపసుపుల, పెద్దముడియం, మోరగుడి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన అరుదైన శిల్పాలు ఇక్కడే భద్రపరిచారు. మ్యూజియం భవనం పాతబడినా అందులోని అరుదైన శిల్పాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపేవారు. శని, ఆది, సోమ వారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది, పండుగ రోజుల్లో మరింత సందడితో కిటకిటలాడేది. నెలకు సరాసరి 3 వేల వరకు పర్యాటకులు ఇక్కడికి వచ్చి పోయే వారని సిబ్బంది చెప్పే వారు. రంగనాథస్వామి, చెన్నకేశవులు, వీరభద్రుడు, శివలింగాలు, ఆంజనేయుడు, వీరగల్లులు, నాట్యమయూరి తదితర రాతి విగ్రహాలు ఆకట్టుకునే రూపంలో ఉన్నాయి.
స్థలముంది నిధులే లేవు
మ్యూజియం కొత్త భవనానికి చాలా సంవత్సరాలుగా అడ్డంకులే ఎదురవుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం కింద రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. అప్పుడు స్థలం లేక నిధులు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రదర్శనశాల ఎదురుగా 1.39 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించింది. నిధులు లేక పనులు మొదలు కాలేదు.
భవనాన్ని కేటాయించాలని కోరాం
మ్యూజియం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు నాలుగు నెలల కిందట మూసేశాం. తాత్కాలికంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేసేందుకు సమీపంలోని హరిత హోటల్‌లోకి మార్చేందుకు సంబంధిత అధికారులను సంప్రదించాం. జిల్లా పర్యాటకశాఖ అధికారులు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ లోగా కరోనా ఎక్కువ కావడంతా తాత్కాలిక భవనంలోకి మార్చే ప్రక్రియ వాయిదా పడింది. - శివకుమార్, ఏడీ, రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాఖ, తిరుపతి
ఇదీ చదవండి..