కడప జిల్లాలోని మైలవరంలోని బాంబు సంఘటన మరవక ముందే ... జమ్మలమడుగులో ఏకంగా 54 నాటుబాంబులు కలకలం రేపాయి. మైలవరంలోని రామచంద్రయ్యపల్లిలో అదే గ్రామానికి చెందిన రైతు పొలాన్నిచదునుచేస్తుండగా ఒక్కసారిగి బాంబులు పేలాయి. సోమశేఖర్ గాయాలతో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటన నుంచి తెరుకునేలోపే.. జమ్మలమడుగులో ఏకంగా 54 బాంబులు ప్రత్యక్షమయ్యాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
జమ్మలమడుగు - ముద్దనూరు రహదారిలో ఉక్కు కర్మాగారం వస్తుందనే ఆశతో పలువురు తమ పొలాలను వెంచర్లుగా మారుస్తున్నారు. పెన్నా నది సమీపంలో ఓ వ్యాపారి తన పొలాన్ని పొక్లెయిన్ సహాయంతో చదును చేస్తున్నాడు. ఈక్రమంలో ఓ స్టీల్ బకెట్ తగలడంతో పోలీసులకు సమాచారం అందించారు. తన సిబ్బందితో సహా వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఒక బకెట్లో పది బాంబులు, పక్కనే మరో ప్లాస్టిక్ బకెట్లో నాలుగు బాంబులు దొరికాయి. పోలీసు క్షుణ్ణంగా పరిశీలించి... రెండు ప్లాస్టిక్ బకెట్లు గుర్తించారు .ట్యాంకర్ల సహాయంతో వాటిని నీటితో తడిపేసి లెక్కించగా ఒక్కో దాంట్లో 20 బాంబులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం నాలుగు బకెట్లలో 54 బాంబులు ఉన్నాయి.
ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగు సభలో పాల్గొన్నారు. సభ కోసం బాంబులు దొరికిన ప్రాంతంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 150 మీటర్ల దూరంలో బాంబులు దొరకడం పలు సందేహాలకు దారి తీస్తోంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం ప్రాంతాల్లో బాంబులు గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఫ్యాక్షన్ గ్రామాల్లో సోదాలు నిర్వహించి ఉన్న బాంబులను ఏరివేయాలని పలువురు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి... జమ్మలమడుగులో బాంబులు.. 14 కాదు.. 54!!