కడప జిల్లాలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ఓటు వేసేందుకు వస్తున్నారు. కొన్నిచోట్ల ఓటు వేసేందుకు బారులు తీరి.. వేచి ఉన్నారు. జమ్మలమడుగు, కొండాపురం, మైలవరం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, పెద్దముడియం మండలాల్లో 115 పంచాయతీల్లో...18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 97 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీగా ప్రత్యేక బలగాలు మోహరించారు. అత్యంత సమస్యాత్మకమైన గూడెం చెరువు , పొన్నతోట గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
పులివెందుల
నియోజకవర్గ పరిధిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. వేముల మండలంలోని దుగ్గన్నగారి పల్లె, పెద్ద జూటూరు గ్రామ పంచాయతీల్లో ఓటు వేసేందుకు జనం బారులు తీరారు. సింహాద్రిపురం మేజర్ పంచాయతీలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో వేచి ఉన్నారు.
ఇదీ చదవండి: కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల సందడి